ఆర్చరీలో మేటి... ఆదుకోరా మరి!
సాక్షి, హైదరాబాద్: పట్టుమని పదేళ్లయినా లేని అరిహంత్ ఆర్చరీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల కుర్రాడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ కుర్రాడి ప్రతిభను గుర్తించిన జాతీయ ఆర్చరీ సంఘం న్యూజిలాండ్‌లో పర్యటించే భారత జట్టుకు ఎంపిక చేసింది. వెల్లింగ్టన్లో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు జరిగే ప్రపంచ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో రావుల అరిహంత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
అయితే నాలుగో తరగతి చదువుతున్న ఈ కుర్రాడి కుటుంబానికి కివీస్ పర్యటనకు అయ్యే ఖర్చును భరించే స్తోమత లేదు. ప్రతిభ ఉండి ప్రపంచ స్థాయి పోటీల్లో రాణించాలనుకుంటున్న ఇతనికి న్యూజిలాండ్ పర్యటన కోసం రూ. 4.5 లక్షలు కావాలి. స్పాన్సర్లు ఎవరూ లేకపోవడంతో అరిహంత్ తండ్రి రావుల రమేష్ దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందజేయాలని అభ్యర్థిస్తున్నారు. సాయం అందించాలనుకునేవారు 9000933382 ఫోన్నంబర్లో సంప్రదించగలరు.