హాలీవుడ్‌ని ఏలుతున్న ఇండియన్ అమ్మాయి అర్చీ పంజాబీ
ఆమె వయసు పాతికేళ్లు. ధరించిన పాత్ర పద్నాలుగేళ్ల అమ్మాయిది. అదే తన మొదటి సినిమా, పైగా హాలీవుడ్ సినిమా.. ధైర్యంగా కెమెరా ముందుకెళ్లింది. తన నటనా ప్రావీణ్యంతో అవార్డునూ సాధించింది. ఆమె మన ఇండియన్ అమ్మాయి – అర్చీ పంజాబీ.
►తల్లిదండ్రులు గోవింద్ పంజాబీ, పద్మా పంజాబీ. ఇద్దరూ బ్రిటన్‌లో స్థిరపడిన స్కూల్ టీచర్స్. చిన్నతనంలో కొంతకాలం ముంబైలో పెరిగింది. అందుకే తనను తాను ‘పార్ట్ బాంబేౖయెట్, పార్ట్ బ్రిటిష్’గా పరిగణించుకుంటుంది.
►ఇంగ్లండ్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, నటిగా మారాలని నిర్ణయించుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఆడిషన్కూ వెళ్లేది. అలా మొదటగా ‘సైరన్ స్పిరిట్స్’ టీవీ సీరియల్లో కనిపించింది.
►సినిమాల్లోకి ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’తో ఎంట్రీ ఇచ్చింది. అందులో ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిలా నటించింది. కానీ, ఆమె వయసు అప్పటికే 25 సంవత్సరాలు. ఆ తర్వాత చేసిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్‌తో ఆమె బుల్లితెర స్టార్‌గా మారింది.
►అర్చీ నటించిన ‘ది కాన్స్టంట్ గార్డెన ర్’ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయింది. అంతేకాదు, వివిధ అవార్డు ఫంక్షన్స్‌లో ‘ఉత్తమ నటి’ అవార్డు, ‘ది చాపర్డ్ ట్రోఫీ’, ‘ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు’, ‘ఇమేజ్ అవార్డు’ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అవార్డులే ఆమెను వరించాయి.
►టెలివిజన్ టాప్ టెన్ యాక్టర్స్‌లో ఒకరిగా నిలవడమే కాదు.. ‘యాస్మిన్’, ‘ఎ మైటీ హార్ట్’, ‘కోడ్ 46’, ‘ఎ గుడ్ ఇయర్’ వంటి పెద్ద సినిమాలూ చేసింది. ప్రస్తుతం వివిధ వెబ్‌సీరిస్ చేస్తూ బిజీగా ఉంది.
►మా అమ్మ వాళ్ల నాన్నతో గొడవపడి టీచర్ ఉద్యోగం సాధించింది. అందుకే, నేను సినిమాల్లో నటిస్తానంటే మా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. పైగా మా అమ్మ ‘ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు’ అని చెప్పి నాలో స్పూర్తిని నింపింది. – అర్చీ పంజాబీ