నగరంలో నందనవనం
=కొత్వాల్‌గూడలో ఎకో పార్కుకు హెచ్ఎండీఏ శ్రీకారం
=రూ.60కోట్లతో 85 ఎకరాల్లో ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో: ‘మహా’నగరం శివారులో అందమైన నందనవరం రూపుదిద్దుకుంటోంది. కిక్కిరిసిన నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు హెచ్ఎండీఏ ‘ఎకో-పార్కు’కు రూపకల్పన చేసింది. శంషాబాద్ సమీపంలోని కోత్వాల్‌గూడ వద్ద ఈ ఉద్యానవనం రూపుదాల్చనుంది. ప్రధానంగా హిమాయత్‌సాగర్ దగ్గరలోని ఔటర్ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్న 85 ఎకరాల స్థలాన్ని పార్కు కోసం ఎంపిక చేసింది. హిమాయత్‌సాగర్ వైపు 60 ఎకరాల్లోను, దాని ఎదురుగా 25 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ప్రణాళికను సిద్ధం చేసింది.
తొలిదశకు టెండర్ల ఆహ్వానం
సుమారు రూ.60 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల వ్యవధిలో ఈ పార్కును పూర్తి చేయనున్నారు. తొలిదశలో భాగంగా 60 ఎకరాల చూట్టూ రూ.62 లక్షల వ్యయంతో ఫెన్షింగ్ బిగించేందుకు తాజాగా టెండర్లు ఆహ్వానించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రూపొందిస్తున్న ఈ నందనవనంలో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆటవిడుపు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం న గరంలో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, దామోదర సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, సరూర్‌నగర్ పార్కు తదితరాలు ప్రజలు సేద తీరేందుకు ఉపకరిస్తున్నాయి.
హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న ఈ పార్కులకు వారాంతాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. అయితే, శివారు ప్రాంత ప్రజలకు ఇలాంటి పార్కులు అందుబాటులో లేవు. దీంతో వారు సెలవు దినాల్లో కుటుంబంతో ఇక్కడకు వచ్చి వెళుతున్నారు. ఇప్పుడు శివారు ప్రాంతంలోనే అద్భుతమైన పార్కు ఏర్పాటు కానుండటంతో నగర పార్కులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా నగరవాసులు కూడా ఆటవిడుపు కోసం శివారులోని ఎకో-పార్కుకు వెళ్లే అవకాశం ఉంది.
అద్భుత ప్రవేశ ద్వారం
పచ్చదనం పరవళ్లు తొక్కే ఈ ఎకో-పార్కుకి అద్భుతమైన ప్రవేశ ద్వారాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించిన డిజైన్‌ను ముంబయికి చెందిన ప్రముఖ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ ప్రధాన్ రూపొందించారు. పార్కులో పచ్చని చెట్లు, పూలమొక్కలు, పచ్చిక బయళ్లతో వనాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రత్యేకించి వివిధ జాతుల నీటి పక్షులు, మైదాన ప్రాంత పక్షుల ఆవాసాలు, నగర సంస్కృతికి అద్దంపట్టే శిల్పాలు, బటర్‌ఫ్లై పార్కు, వ్యవసాయానికి ఉపకరించే వివిధ జాతుల మొక్కలు, గ్రామీణ ప్రాంత వాతావరణ ం, సోలార్ ఫార్మ్, పబ్లిక్ పార్కు, పిక్నిక్ ఏరియా, మౌంటెన్ బైకింగ్ ట్రాక్స్, వినోద భరిత హంగులతో పాటు చూపరులను కట్టిపడేసే ల్యాండ్ స్కేప్‌తో తీర్చిదిద్దనున్నారు. ఇప్పటివరకు గుట్టలు, తుప్పలతో ఉన్న ఈప్రాంతం ఇకపై పచ్చదనంతో కళకళలాడనుంది.