2050లో ఒకానొక రోజు.. కొత్త బంగారు లోకం..
ఉదయం ఆఫీసుకెళ్లడానికి మీరు మీ అపార్ట్మెంటు నుంచి బయటికి వచ్చారు.. మీ అపార్ట్మెంట్ కారిడార్ పక్కన మామిడి, జామ, బొప్పాయి, ఆపిల్ ఇలా రకరకాల చెట్లు.. వెళ్తూవెళ్తూ చెట్టు నుంచి ఓ ఆపిల్ కోసుకుని.. తింటూ.. లిఫ్ట్ వద్దకు వెళ్లారు.. అద్దాలున్న లిఫ్ట్‌లో దిగుతున్నారు.. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో పంటను, పూల, పళ్ల తోటలను చూసుకుంటూ..
కొత్త బంగారు లోకం..
ప్రస్తుతానికిది ఊహే.. కానీ బెల్జియంకు చెందిన ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలెబాట్ డిజైన్ ‘డ్రాగన్‌ఫ్లై’ కార్యరూపం దాలిస్తే.. ఈ అద్భుతం మన కళ్లెదుటే సాక్షాత్కరిస్తుంది. మన ఆరోగ్యకరమైన భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని విన్సెంట్ చెబుతున్న ఈ ‘డ్రాగన్‌ఫ్లై’లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 132 అంతస్తుల ఈ ‘పట్టణ వ్యవసాయ క్షేత్రం’లో ఆఫీసులు, ఇళ్లతోపాటు పొలాలు, తోటలు, డెయిరీ, కోళ్ల పెంపకం వంటివెన్నో ఉన్నాయి. అంతేకాదు.. ఒక్కో బిల్డింగ్ మినీ పవర్ స్టేషన్లాగా ఉంటుంది. సూర్యకాంతి నుంచి సౌర విద్యుత్, గాలి నుంచి పవన విద్యుత్‌ను తయారుచేసుకునే సదుపాయాలుంటాయి.
ఈ భవనానికుండే ‘రెక్కల’ వంటి ఏర్పాటు వల్ల ఎండాకాలంలో వేడిగాలినిఅది నిల్వ చేసి.. చలికాలంలో గదులకు వెచ్చదనాన్ని అందజేస్తుంది. ఇక ఎండాకాలంలో చుట్టూ తోటల వల్ల చల్లదనం ఉండటంతోపాటు బయట నుంచి గాలి ధారాళంగా వచ్చే ఏర్పాట్లుంటాయి. అంతేకాదు.. వర్షపు నీటిని నిల్వ చేసి.. మొక్కలకు వాడతారు. వ్యర్థ పదార్థాలను ఎరువులుగా మార్చి.. పంటలకు ఉపయోగిస్తారు. రోజురోజుకూ జనాభా పెరగడం.. నగరాలు విస్తరిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం వంటి వాటి వల్ల భవిష్యత్తులో వ్యవసాయ క్షేత్రాలు తగ్గిపోతాయని.. ఆ పరిస్థితుల్లో డ్రాగన్‌ఫ్లై డిజైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని విన్సెంట్ చెబుతున్నారు.