విద్య, వైద్యమే కీలకం
వ్యాధుల నివారణకు ప్రణాళిక
పీహెచ్సీ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు
కార్పొరేట్‌కు ధీటుగా ఆశ్రమాల్లో విద్య
‘సాక్షి’తో ఐటీడీఏ పీఓ రాజీవ్
భద్రాచలం : ఏజెన్సీలో విద్య, వైద్య రంగాలే కీలకమని, వీటిలో పురోగతి సాధిస్తేనే గిరిజనులందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏజెన్సీ పరిధిలో 658 గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి దోమల నివారణకు అల్ఫా సైఫర్ మిథిన్(ఏసీఎం) స్ప్రే చేయించామని తెలిపారు. మరో 3 వందల గ్రామాల్లో ఈ నెల 19 నుంచి రెండో విడత దోమల మందు పిచికారీ చేయిస్తామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ర్యాఫిడ్ ఫీవర్ సర్వే పకడ్బంధీగా అమలు చేస్తున్నామన్నారు.
పీహెచ్సీ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులతో శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మందుల కొరత లేదని, త్వరలోనే దోమ తెరలను కూడా తెప్పిస్తామని చెప్పారు. ప్రతి పీహెచ్సీలో ఒక వైద్యుడు తప్పని సరిగా అందుబాటులో ఉండేలా సర్దుబాటు చేశామన్నారు. 28 ఆర్బీఎస్కే టీమ్‌లను వైద్య శిబిరాల నిర్వహణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
విద్యపై దృష్టి
ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. 26 వేల మంది విద్యార్థులకు తొలిసారిగా టై, ఐడీ కార్డు, బెల్టు అందజేస్తామన్నారు. ఇప్పటికే పాదరక్షలు పంపిణీ చేశామన్నారు. ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు, సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, రెండు వారాల్లోగా వీటిని పంపిణీ చేస్తామన్నారు.
వాట్సాప్‌తో సమగ్ర సమాచారం
వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, మెనూ అమలుపై ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. తాను స్వయంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై నేరుగా ఏడీఎంహెచ్‌ఓకు సమాచారం ఇచ్చేలా మరో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశామన్నారు.
హరితమిత్ర అవార్డు స్ఫూర్తితో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఐటీడీఏకు అవార్డు లభించడం గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది 35 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గరిమెళ్లపాడు నర్సరీలో పూలు, పండ్ల మొక్కలు పెంచి వచ్చే ఏడాది పంపిణీ చేస్తామని తెలిపారు.