గూగుల్ ఫుడ్ డెలివరీ యాప్.. ఆరియో
► హోమ్ సర్వీసులు కూడా
► ముందుగా ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు
బెంగళూరు: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్లో ఫుడ్ డెలివరీ, హోమ్ సర్వీసెస్కి సంబంధించి ఆరియో యాప్ను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై, బెంగళూరులో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఫుడ్ డెలివరీ సేవల కోసం బాక్స్8, ఫ్రెష్మెను, ఫాసూస్ వంటి సంస్థలతోను, గృహ సంబంధ సర్వీసుల కోసం అర్బన్క్లాప్, జింబర్ సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 8–10 నెలలుగా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోవడంపై గూగుల్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
మూడు నెలల క్రితమే తమ ఉద్యోగుల కోసం పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో.. ఆరియోను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది. ఆరియో ద్వారా వినియోగదారులు, స్టార్టప్ సంస్థల మధ్య అనుసంధానకర్తగా గూగుల్ వ్యవహరిస్తుంది తప్ప ఈ సేవల కోసం ప్రత్యేకంగా తమ సిబ్బందిని వినియోగించదు. ఆయా స్టార్టప్ సంస్థలే సర్వీసులు అందించాల్సి ఉంటుంది.
అయితే అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నందున గూగుల్ కొంత కమీషన్ తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు పెద్దగా పోటీదారు కానప్పటికీ.. రాబోయే రోజుల్లో కార్యకలాపాలు విస్తరించిన పక్షంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సేవల సంస్థలపై ఆరియో ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీ స్టార్టప్ సంస్థల్లోకి నిధుల ప్రవాహం తగ్గిపోయిన తరుణంలో గూగుల్ ప్రవేశం ప్రాధాన్యం సంతరించుకుంది.