ఎఫ్1లో మరో భారతీయుడు
హాస్ జట్టు డెవలప్మెంట్ డ్రైవర్‌గా అర్జున్ మైని
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన నారాయణ్ కార్తికేయన్, కరుణ్ చందోక్ తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1)లో భాగమయ్యే అవకాశం మరో భారతీయ డ్రైవర్‌కు దక్కనుంది. బెంగళూరుకు చెందిన యువ రేసర్ అర్జున్ మైనితో అమెరికా ఫార్ములావన్ జట్టు హాస్ ఎఫ్1 గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అర్జున్, హాస్ జట్టుకు డెవలప్మెంట్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ప్రస్తుతం జీపీ3 రేసుల్లో నిలకడగా రాణిస్తోన్న 19 ఏళ్ల ఈ యువ రేసర్... ఎఫ్1 జట్టు నుంచి అనుకోకుండా వచ్చిన అవకాశంపై హర్షం వ్యక్తం చేశాడు.
‘ఫార్ములావన్ డ్రైవర్ అవ్వాలనే నా లక్ష్యానికి నేను మరింత చేరువయ్యాను. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరింతగా రాణిస్తాను’ అని అర్జున్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సీజన్ జీపీ3 రేసుల్లో అర్జున్ ప్రదర్శనపైనే అతనికి ఎఫ్1లో అవకాశం లభిస్తుందా లేదా అనే విషయం ఆధారపడి ఉందని అతడి మేనేజర్, ఫార్ములావన్ మాజీ డ్రైవర్ కరుణ్ చందోక్ అన్నాడు. కాగా ఈ వారాంతంలో స్పానిష్ గ్రాండ్‌ప్రి రేసుతో జీపీ3 సీజన్ ప్రారంభం కానుంది.