సచిన్ కుమారుడి ఫొటోతో కలకలం
ఆగ్రా: ఏ కాలేజీ కుర్రాడికైనా, ఉపాధ్యాయుడికైనా క్రికెట్ దేవుడు సచిన్, అర్జున్ టెండూల్కర్లు ఎవరో వాళ్లు ఎక్కడ ఉంటారో తెలిసే వుంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ ఇంటర్ బోర్డు అధికారుల తీరే వేరు. ఆగ్రాలోని రాజా బలవంత్ సింహ్ కాలేజీ సెంటర్... విద్యార్థులకు జారీ చేసిన హాల్ టికెట్ ఇంటర్ బోర్డు అవినీతి, అరాచకాలకు అద్దం పట్టింది. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఫోటోతో హాల్ టికెట్‌ను జారీ చేసింది.
పరీక్షలకు ఒకే రోజు గడువు ఉన్నందున చివరి క్షణంలో హాల్ టికెట్ అందుకున్న అర్జున్ సింగ్ అనే టెన్త్ స్టూడెంట్ హాల్ టికెట్ పై అర్జున్ టెండూల్కర్ ఫొటో చూసి లబో దిబో మంటున్నాడు. వేరే వారి పేర్లతో పరీక్షలు రాయడం యూపీలో సాధారణ విషయమని, అంతెందుకు ఓ పాతిక వేలు పారేస్తే హఫీజ్ సయీద్ ఫొటోను అతికించినా అధికారులు వెరిఫై చేయకుండా హాల్ టికెట్ జారీ చేస్తారని విద్యా నిపుణులు విమర్శిస్తున్నారు.
జంతువుల బొమ్మలతో కూడా హాల్ టిక్కెట్లు జారీ చేసిన ఘనత మనదేశ విద్యావిభాగాలకు ఉంది. గతేడాది మే నెలలో జమ్మూకశ్మీర్ లో ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జారీ చేసిన చేసిన హాల్ టిక్కెట్ లో ఆవు ఫొటో ముద్రించారు. గత జూన్ లో పశ్చిమ బెంగాల్ లో ఓ విద్యార్థి హాల్ టిక్కెట్ పై కుక్క ఫొటో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది.