శిథిలావస్థలో అర్లి వంతెన
కూలితేదూరభారం
రాకపోకలకు ఇబ్బందులు
లోకేశ్వరం : మండలంలోని అర్లి-లోకేశ్వరం మార్గంలోని సుద్దవాగు వంతెన శిథిలావస్థకు చేరింది. ఎస్సారెస్పీ నిధులతో వంతెన నిర్మించి పాతికేళ్లు కాకుండానే కూలడానికి సిద్ధంగా ఉంది. వంతెన ప్రారంభంలోని ఇరువైపులా ఉన్న గోడలు పగుళ్లు చూపాయి. వర్షాకాలంలో కురిసె వర్షం నీరు వంతెనలో నిలుస్తోంది. ఈ వంతెన రహదారి పూర్తిగా ఆధ్వానంగా తయారైంది.
అర్లి వంతెన నుంచి లోకేశ్వరం మీదుగా అబ్ధుల్లాపూర్ వరకు తారు రోడ్డును వేశారు. కానీ, ఈ వంతెన కూలినట్లయితే తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి ఎలాంటి మార్గం లేదు. ఈ వంతెన నుంచి ప్రయాణం చేయడానికి వాహనదారులు జంకుతున్నారు. వంతెన ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
కూలితే తప్పని దూరబారం
మండలం నుంచి ప్రతినిత్యం వందల సంఖ్యలో అర్లి వంతెనపై వాహనాలు ప్రయాణిస్తాయి. ఈ వంతెన ద్వారా నిర్మల్‌కు చేరుకోవడానికి 45 కిలోమీటర్లు ప్రయాణించాలి. వంతెన కూలితే భైంసా మీదుగా వెళ్లాలంటే 85 కిలోమీటర్ల దూరభారం అవుతోంది. వంతెన కూలకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేట్టాలని మండల వాసులు కోరుతున్నారు.
మరమ్మతులు చేపట్టండి
అర్లి వంతెనకు మరమ్మతు చేపట్టాలి. వంతెనపై నుంచి ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నాం. వెంటనే ప్రభుత్వం నిధలు మంజూరు చేసి మరమ్మతు పనులు చేపట్టాలి.
- భూమన్న, పంచగుడి
కూలితే ఇబ్బందులే
వంతెన కూలితే నిర్మల్ ప్రాంతాలకు వెళ్లాలంటే దూరభారం అవుతుంది.వెంటనే వంతెనకు మరమ్మతు చేపడితే ప్రయాణికులకు ప్రయాణం సులభతరమవుతుంది.
- నారాయణ, రాజూరా
ప్రతిపాదనలు పంపాం
అర్లి వంతెన శిథిలావస్థలో ఉందన్న మాట వాస్తవమే. ఈ వంతెనపై భారీ లోడ్ వాహనాలు ప్రయాణం చేయకుండా నిషేధించాం. వంతెన విషయమై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిచాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతు పనులు చేపడతాం. - స్వతంత్ర తీవారి, పీఆర్‌జేఈ, లోకేశ్వరం