కాశ్మీర్ సర్కారును పడగొట్టాలనుకోలేదు: వీకే సింగ్
అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే ఓ స్వచ్ఛంద సంస్థకు భారత సైన్యం నుంచి నిధులు మంజూరుచేశాం తప్ప.. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏమీ ఇవ్వలేదని ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ స్పష్టం చేశారు. గులాం హసన్ మీర్ అనే కాశ్మీరీ మంత్రికి ఆర్మీ నుంచి రహస్యంగా నిధులు వెళ్లాయన్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిచ్చారు.
యువతను అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆకర్షితులు చేయడానికి డబ్బులు అవసరమైతే ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. కోటి రూపాయలతోనే మన లాంటి గొప్ప దేశంలో ప్రభుత్వాలు పడిపోయేటట్లయితే రోజుకో ప్రభుత్వం పడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, మహిళలకు శిక్షణ, పిల్లలను రాళ్లు విసిరే కార్యక్రమాల నుంచి దూరంగా తేవడం లాంటి కార్యక్రమాలు చేయడానికే ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేయడానికి మంత్రి మీర్‌కు రూ. 1.19 కోట్ల ఆర్మీ నిధులు వెళ్లినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.