‘మార్పు’ నిరంతరం
విశాఖపట్నం, న్యూస్‌లైన్:
ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేసి గ్రామీణులకు అన్ని సంక్షేమ పథకాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ‘మార్పు’ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పథకాల అమలుకు సర్పంచ్‌లు చైర్మన్లుగా కమిటీలను నియమించాలని సూచించారు. నెల రోజుల్లో కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సమీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కమిటీలలో అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశావర్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి, ఐకేపీ వలంటీర్ ఉంటారన్నారు. వారంతా ‘మార్పు’ 20 సూత్రాల అమలుకు నిరంతరం పాటుపడాలన్నారు. ఇక మీదట గ్రామాల్లో పౌష్టికాహార లోపం సమస్య రాకూడదన్నారు.
అతిసార డయేరియా వంటి వ్యాధులు ప్రబలకూడదని, పురిట్లోనే పిల్లలు మృతి చెందడం అనే వార్తలు రాకూడదని, గర్భిణులకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ప్రచారం జరుగకూడదన్నారు. అంతా సమిష్టిగా గ్రామగ్రామాన తిరిగి అందరికీ ‘మార్పు’ ఉద్దేశ్యం ఇప్పుడు..ఎల్లప్పుడూ వివరించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ రెడ్డి శ్యామల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, సబ్‌కలెక్టర్ శ్వేత తెవతియ, ట్రైనీ కలెక్టర్ కృష్ణభాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎన్‌ఆర్‌వి సోమరాజు, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ మహేశ్వర్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాబర్ట్స్, వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికాారి డాక్టర్ నాయక్, మలేరియా అధికారి ప్రసాద్ పాల్గొన్నారు.
ఆస్పత్రిలో ప్రసవిస్తే రూ. వెయ్యి ఇవ్వాల్సిందే..!
ఆస్పత్రులలో ప్రసవించిన బాలింతలకు వెంటనే రూ. వెయ్యి ఇవ్వాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఆరోఖ్య రాజ్ స్పష్టం చేశారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అంటూ నిబంధనలు పెట్టరాదన్నారు. ఎంసీపీ కార్డు ఆధారంగా ప్రసవించిన వారికి ఆ మొత్తాన్ని చెల్లించాలన్నారు. బాలింతలకు ఇచ్చే మొత్తంలో కక్కుర్తి పడొద్దని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.