రైతుకు నష్టపరిహారంగా రైలు!
కోర్టు తీర్పు
ఇరవై బోగీల ఎక్స్‌ప్రెస్ రైలు.. ‘స్వర్ణ శతాబ్ది’! రోజూ ఢిల్లీ–అమృత్‌సర్‌ల మధ్య నడుస్తుంది. రెండు రోజుల క్రితం వరకు ఈ రైలు భారతీయ రైల్వేలది. ఇప్పుడు సంపూరణ్ సింగ్ అనే రైతుది! రైలే కాదు, లూథియానాలోని ఒక రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు ఈయన ఆధీనంలోకి వచ్చింది. రైల్వేశాఖ సంపూరణ్ సింగ్‌కి చెల్లించవలసిన కోటి రూపాయల బకాయీలను ఎంతకూ తీర్చకపోవడంతో స్వర్ణ శతాబ్ది రైలును, లూథియానా స్టేషన్‌ను అతడికి బదలాయిస్తూ పంజాబ్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనిప్పుడు తనకు దక్కిన స్టేషన్‌ని అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మరి రైలును ఎలా అమ్మడం? ఎవరికి అమ్మడం? సంపూరణ్ సింగ్ వచ్చిన కొత్త సమస్య ఇది.
పాత సమస్య ఏంటంటే...
సంపూరణ్ సింగ్‌ది లూథియానాలోని కటాన గ్రామం. ఆయనొక రైతు. కొద్దిగా పొలం ఉంది. అందులో గోధుమలు పండించేవాడు. 2007లో లూథియానా చండీఘర్ల మధ్య కొత్త రైల్వే లైను వెయ్యడానికి ఉత్తర రైల్వే శాఖ ఆయన పొలంలోని 5.5 బిగాల భూమిని సేకరించింది. పరిహారంగా ఆయనకు 45 లక్షల రూపాయలను చెల్లించింది. అప్పటికైతే సంపూరణ్ సంతోషించాడు కానీ, పక్కనే బర్వాలాలో సేకరించిన భూమికి తనకు ఇచ్చినదాని కన్నా ఎక్కువ పరిహారం ఇవ్వడం ఆయనకు కోపం తెప్పించింది. అదే విషయాన్ని రైల్వే అధికారులను అడిగితే వారు నోరు మెదపలేదు.
దాంతో కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆ వాదనా ఈ వాదనా విని, ఆ లెక్కా, ఈ లెక్కా వేయించి రైల్వేశాఖ సంపూరణ్‌కి వెంటనే ఒక కోటీ 47 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. కేసు అక్కడితో ఆగలేదు. ముందు చెల్లించిన మొత్తాన్ని మినహాయించగా రైల్వే శాఖ తను ఇవ్వాల్సిన కోటి రూపాయలను సంపూరణ్‌కి ఇవ్వకుండా తనూ వాయిదాలకు వెళ్లివస్తూ కాలక్షేపం చేసింది. సంపూరణ్ 2012లో మరో కేసు వేశాడు. దానిపై వాదోపవాదాలు అయ్యాక రైల్వే శాఖ ఈ రైతుకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వాల్సిందేనని 2015 జనవరిలో తీర్పు చెప్పింది. దానికీ బదులు లేదు. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరికి మొన్న శుక్రవారం అంతిమ తీర్పు వెలువడింది. రైల్వే శాఖ కోర్టు ఆదేశాలను అనుసరించి కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించకపోవడంతో అంతే విలువైన ఒక రైలును, ఒక రైల్వేస్టేషన్‌ను సంపూరణ్‌కు కోర్టు స్వాధీనం చేసింది.
అదే రోజున స్వాధీన పత్రాలు పట్టుకుని సంపూరణ్ లూథియానా రైల్వేస్టేషన్లో వేచి ఉన్నప్పుడు స్వర్ణ శతాబ్ది ‘కూ ఛుక్‌చుక్’ మంటూ వచ్చింది ఆగింది కానీ, ‘ఈ రైలు నాది’ అని ఆయన ఆ రైలును అక్కడే నిలిపేయలేకపోయారు. ‘‘గమ్యాలకు చేరుకునేందుకు అలసిసొలసి ఉన్న అంత మంది ప్రయాణీకులను చూశాక దానిని స్వాధీనం చేసుకోడానికి మనసొప్పలేదు’’ అని సంపూరణ్ అన్నారు. పెద్ద సమస్యే.
స్టేషన్లో ఆగిన స్వర్ణశతాబ్ది రైలింజన్లోకి ఎక్కి, రైలు స్వాధీన పత్రాలు చూపిస్తున్న రైతు సంపూరణ్ సింగ్