దేశం మారింది! సినిమా మారింది!
రీల్ టు డిజిటల్
వివిధ భాషల్లో ఏటా వెయ్యికి పైగా సినిమాలను నిర్మిస్తూ, 300 కోట్ల పైచిలుకు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్న ఘనత భారతీయ సినీ రంగానిది. ఆదాయం లెక్కల సంగతి పక్కనపెడితే, ఈ రకంగా మనది ప్రపంచంలోని అతి పెద్ద వినోద పరిశ్రమ. స్వాతంత్య్రం అనంతరం ఈ ఏడు దశాబ్దాల్లో భారత సినీ పరిశ్రమలో వచ్చిన నిర్మాణ, సాంకేతిక పరిణామాలు అనేకం. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే తీసిన మూకీ ‘రాజా హరిశ్చంద్ర’ తొలి స్వదేశీ కథాకథనాత్మక చిత్రం. అప్పటి నుంచి 1931లో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ వచ్చే దాకా అన్నీ మాటలు లేని సినిమాలే. 1940 తొలి నాళ్ల దాకా చిత్రీకరణ సమయంలో నటిస్తూ నటీనటులు స్వయంగా పలికిన మాటలు, పాటలనే ఫిల్మ్‌పై రికార్డ్ చేసేసేవారు.
ఆ తరువాత డైలాగుల్ని విడిగా రికార్డు చేసే డబ్బింగ్ ప్రక్రియ, ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ సెట్లో నటిస్తున్నప్పుడే డైలాగ్‌లు కూడా రికార్డు చేసేసే పద్ధతి ‘సింక్ సౌండ్’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది. నాడు షూటింగ్ అంటే బండ బరువుండే డెబ్రీ, మిచెల్ తరహా కెమేరాలతోనే! నేడు బరువు తక్కువ యారీఫ్లెక్స్ కెమేరాలు, ఒంటికి తగిలించుకొనే ‘స్టడీ కామ్’లు వచ్చాయి. స్వాతంత్య్రం తర్వాత 35 ఎంఎం నుంచి సినిమా స్కోప్, 70 ఎం.ఎం, ఆపైన అద్దాలు పెట్టుకొని చూసే 3డీ సినిమాలు తయారయ్యాయి.
డాల్బీ, డీటీఎస్, డాల్బీ ఎట్మాస్ల పేరిట సౌండ్ ఎఫెక్ట్లూ అదిరిపోతున్నాయి. అప్పట్లో సినిమాను ముడి ఫిల్ముపై చిత్రీకరించేవారు. ఎన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించాలంటే, అన్ని ప్రింట్లు తీయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫిల్మ్ అక్కర్లేదు... హార్డ్ డిస్క్ ఉంటే చాలు. డిజిటల్ చిత్రాన్ని శాటిలైట్ ద్వారా థియేటర్లకు పంపి, ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శిస్తున్నారు. నాడు ఊరూరా తిరుగుతూ, డేరాలు వేసి సినిమాలు ప్రదర్శించేవారు. టాకీలొచ్చాకా టూరింగ్ టాకీస్‌లే ఎక్కువ. క్రమంగా పర్మినెంట్ థియేటర్లు వచ్చాయి. 1927లో 309 హాళ్లుంటే... 1947లో సుమారు 2 వేల థియేటర్లుండేవి. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లు, ఐ-మ్యాక్స్‌లు... వెరసి దేశంలో నేడు 14 వేల సినిమా స్క్రీన్స్ ఉన్నట్లు అంచనా.