arsenic in water
-
దేశంలో విషతుల్యంగా భూగర్భ జలాలు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం భూభాగంలోని 20 శాతం భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్ కలిగి ఉండి, విషతుల్యంగా మారాయని, నీటిలోని ఈ విషతుల్యమైన పదార్థం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సర్వే లో వెల్లడయ్యింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆర్సెనిక్ నమూనాలు ప్రస్తుత సర్వేలో తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గతంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు జరిపిన అధ్యయనాలు సైతం వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ స్థాయిని అంచనా వేసేందుకు మరింత విస్తృతమైన పరిశోధనల అవసరాన్ని సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన నొక్కి చెపుతోంది. రక్షిత నీటినే తాగుతున్నామా? దేశవ్యాప్తంగా ప్రజలు తాగుతోన్న నీటిలో అత్యధికంగా 80 శాతం భూగర్భ జలాలే. అత్యధిక జనాభా తాగునీటి కోసం ఆధారపడిన భూగర్భ జలాలు సురక్షితమైనవేనా? అనే విషయంలో అనేక అధ్యయనాలు గతం నుంచి జరుగుతున్నాయి. దేశంలోని 20 శాతం భూభాగంలోని భూగర్భ జలాలు అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్తో నిండి వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆర్సెనిక్ అత్యంత విషపూరితమైనది. తాగు నీరు, ఆహారం ద్వారా ఆర్సెనిక్‌ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు గురికావడం, లేదా తీవ్రమైన చర్మసంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నదీపరివాహక ప్రాంతాల్లో ఎక్కువ.. గంగా–సింధు, బ్రహ్మపుత్రా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ, భారతదేశంలోని కొన్ని ద్వీపకల్ప ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఈ అత్యంత విషతుల్యమైన ఆర్సెనిక్ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ‘‘దేశంలోని 250 మిలియన్ల మంది ప్రజలు భూగర్భ జలాల్లో నిక్షిప్తమైన ఉన్న విషతుల్య పదార్థం ఆర్సెనిక్ ప్రభావానికి గురవుతున్నట్టు అంచనా వేశాం’’అని పశ్చిమబెంగాల్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలో.. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిని ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. జియోలాజికల్, హైడ్రోజియోలాజిక్, ఆంతోపోజెనిక్ ప్రమాణాలను బట్టి లీటరు భూగర్భజలంలో పది మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉండొచ్చు. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆ స్థాయిని మించి భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. భూగర్భజలాల్లో తీవ్రస్థాయిలో ఉన్న ఆర్సెనిక్ పరిణామాన్ని అంచనా వేయడానికి తీసుకున్న శాంపిల్స్ ఇంకా సరైన స్థాయిలో లేవని సహ రచయిత సౌమ్యాజిత్ సర్కార్, మధుమిత చక్రవర్తి సహా అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత అధ్యయనం ఆర్సెనిక్ తీవ్రతని చాలా తక్కువగానే అంచనా వేసినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. సురక్షిత తాగునీరే లక్ష్యం.. ఈ అధ్యయనంలో రాండమ్ ఫారెస్ట్ అనే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించామని, ఇది భూగర్భ జలాల్లోని ఆర్సెనిక్ ని అంచనావేయడంలో సమర్థంగా పనిచేస్తుందని గత పరిశోధనల్లో వెల్లడయ్యింది అని ముఖర్జీ తెలిపారు. ప్రభుత్వ జల్‌జీవన్ మిషన్‌లోని, 27 లక్షల క్షేత్రస్థాయి ప్రమాణాల ఆధారంగా ఆర్సెనిక్‌ని అంచనావేశారని, ఈ అధ్యయనం ఫలితాలు సురక్షిత మంచినీటిని ఇంటింటికీ అందిచేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్సెనిక్ ప్రభావం భారత్‌పై అధికం ఆర్సెనిక్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారతదేశం ఒకటని అధ్యయనవేత్తలు తేల్చి చెప్పారు. పశ్చిమబెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విష తుల్యమైన ఆర్సెనిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. భారత దేశంలో 80 శాతం తాగునీరు భూగర్భజలాలపై ఆధారపడినదే. దేశంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడి జీవిస్తోన్న 9 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆర్సెనిక్ వల్ల ప్రమాదంలో పడినట్టు గతంలో జరిపిన అధ్యయనాల్లో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో ఎక్కువ భాగం స్థానికంగా, క్షేత్రస్థాయి లో జరిగినవే. ఇందులో అత్యధికంగా గంగా పరీవాహక ప్రాంతాల్లో జరిగాయి. అయితే ఇవేవీ దేశంలోని ఇతర ప్రాంతాలకు వర్తించవు. -
ఈ నీళ్లు తాగితే కేన్సర్ ఫ్రీ!
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్.. దక్షిణాదిలోని ఈ నాలుగు ప్రధాన నగరాల్లో నీళ్లు తాగితే కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. ఈ నాలుగు నగరాల్లో ఉన్న భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే విషపదార్థం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఎక్కువ కాలం పాటు ఈ నీళ్లు వాడటం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు ఎక్కువవుతాయని అన్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు.. ముఖ్యంగా పిల్లల విషయంలో తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, జపాన్‌కు చెందిన నేషనల్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా చేసిన పరిశోధనలలో తెలిపారు. నీటివనరులలో కొన్ని రకాల పదార్థాలు ఉండటం అవసరమేనని, అయితే అవి ఎంత స్థాయిలో ఉండాలో అంత స్థాయిలో కాకుండా ఎక్కువ అయినప్పుడే వాటివల్ల ప్రమాదం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాటిలో ఆర్సెనిక్, పాదరసం, సీసం, కాడ్మియం లాంటివి ముఖ్యమైనవన్నారు. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్ నగరాల్లో చాలావరకు పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. వీటి నుంచి పాక్షికంగా మాత్రమే శుద్ధి చేసిన జలాలను నదులు, ప్రవాహాల్లోకి వదిలిపెడుతున్నారు. ప్రధానంగా ఉపరితల నీటి వనరుల మీదే ఎక్కువగా ఆధారపడుతున్న ప్రజలు.. ఈ వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిసేలోపే అవి శరీరాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఈ విషయాన్ని తేల్చడానికి మొత్తం 48 ప్రాంతాల్లో ఉన్న జలవనరుల నుంచి శాంపిళ్లు సేకరించారు. వాటిలో చెరువులు, కాలువలు, ట్రిబ్యుటరీలు, ప్రధాన నదుల నుంచి తీసుకున్న నీళ్లు ఉన్నాయి. వాటిలో క్రోమియం, సెలీనియం, ఆర్సెనిక్, ఐరన్, మాంగనీస్ కాలుష్యాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. వాటితో పాటు రాగి, సీసం, కాడ్మియం, వనాడియం కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు, ఆటోమొబైల్ రనాఫ్ల వల్ల ఇవి వస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.