ఈ నీళ్లు తాగితే కేన్సర్ ఫ్రీ!
ఈ నీళ్లు తాగితే కేన్సర్ ఫ్రీ!
Published Fri, Oct 28 2016 4:48 PM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్.. దక్షిణాదిలోని ఈ నాలుగు ప్రధాన నగరాల్లో నీళ్లు తాగితే కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. ఈ నాలుగు నగరాల్లో ఉన్న భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే విషపదార్థం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఎక్కువ కాలం పాటు ఈ నీళ్లు వాడటం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు ఎక్కువవుతాయని అన్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందన్నారు.
ఈ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు.. ముఖ్యంగా పిల్లల విషయంలో తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, జపాన్‌కు చెందిన నేషనల్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా చేసిన పరిశోధనలలో తెలిపారు. నీటివనరులలో కొన్ని రకాల పదార్థాలు ఉండటం అవసరమేనని, అయితే అవి ఎంత స్థాయిలో ఉండాలో అంత స్థాయిలో కాకుండా ఎక్కువ అయినప్పుడే వాటివల్ల ప్రమాదం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాటిలో ఆర్సెనిక్, పాదరసం, సీసం, కాడ్మియం లాంటివి ముఖ్యమైనవన్నారు. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్ నగరాల్లో చాలావరకు పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. వీటి నుంచి పాక్షికంగా మాత్రమే శుద్ధి చేసిన జలాలను నదులు, ప్రవాహాల్లోకి వదిలిపెడుతున్నారు. ప్రధానంగా ఉపరితల నీటి వనరుల మీదే ఎక్కువగా ఆధారపడుతున్న ప్రజలు.. ఈ వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిసేలోపే అవి శరీరాన్ని ఛిద్రం చేస్తున్నాయి.
ఈ విషయాన్ని తేల్చడానికి మొత్తం 48 ప్రాంతాల్లో ఉన్న జలవనరుల నుంచి శాంపిళ్లు సేకరించారు. వాటిలో చెరువులు, కాలువలు, ట్రిబ్యుటరీలు, ప్రధాన నదుల నుంచి తీసుకున్న నీళ్లు ఉన్నాయి. వాటిలో క్రోమియం, సెలీనియం, ఆర్సెనిక్, ఐరన్, మాంగనీస్ కాలుష్యాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. వాటితో పాటు రాగి, సీసం, కాడ్మియం, వనాడియం కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు, ఆటోమొబైల్ రనాఫ్‌ల వల్ల ఇవి వస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
Advertisement