ఆభ‘రణం’
బ్యూటిప్స్
గిల్టు నగలు, ఫ్యాషన్ జువెల్రీ (స్టీలు, రాగి,.. ఇతర లోహాలతో చేసిన ఆభరణాలు) ధరించినప్పుడు... చాలాసార్లు ఉంగరం ఉన్న వేలు చుట్టూ నీలి రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. మెడ మీద మంట, దద్దుర్లు వస్తుంటాయి. చెవి ఆభరణాలు వల్ల అక్కడి చర్మం చిట్లి చీము, రక్తం కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య మరీ అధికం. కృత్రిమ ఆభరణాలలో నికెల్ ఎక్కువ ఉంటే ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు...
గిల్టునగలకు- చర్మానికి మధ్యలో ఫ్యాబ్రిక్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే కృత్రిమ ఆభరణాలు మెడలో ధరించేటప్పుడు హై నెక్ కాలర్, చేతులకు ధరించినప్పుడు లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్‌లు ధరించాలి. ఈ విధమైన వస్త్రధారణ, అలంకరణ వల్ల ఫ్యాషనబుల్‌గానూ కనిపిస్తారు.
ఏదైనా వేడుకల సమయంలో కృత్రిమ ఆభరణాలను తప్పనిసరిగా ధరించాల్సి వస్తే.. ఎక్కువసేపు ఉంచకూడదు. వీలైనంత త్వరగా తిరిగి వాటిని తీసేయడం మంచిది.చెమటకు ఆభరణాలోని రంగు, తీగల వల్ల చర్మంపై సన్నని దద్దుర్లు(ర్యాష్) ఏర్పకుండా ఉండాలంటే గాలి తగిలే చోట ఉండాలి.ఆభరణాలను తీసివేసాక మెడ, చేతులు, చెవులు.. చల్లని నీటితో శుభ్రపరుచుకొని తర్వాత బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆభరణాల వెనుకవైపు అదే రంగు నెయిల్ పాలిష్ వేసి, పూర్తిగా ఆరిన తర్వాత ధరించాలి. లేదంటే నికెల్ ఫ్రీ సొల్యూషన్ లిక్విడ్‌ను ఆభరణాల వెన కవైపు రాసి, ఆరబెట్టి ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు మంట, ర్యాష్‌ను తగ్గిస్తాయి.
ఇమిటేషన్ జువెల్రీకి బదులు పూసలు, లెదర్, థ్రెడ్, టైట.. వంటి అందమైన ఆభరణాలు లభిస్తున్నా యి. వీటిని ఉపయోగించవచ్చు. 18-22 క్యారెట్లు గల బంగారు ఆభరణాల ధర ఎక్కువ. 18 కన్నా తక్కువ క్యారెట్ల బంగారు ఆభరణాలను ఎంచుకోవచ్చు. ఈ ఆభరణాల ధరలు కొంత తక్కువగా ఉంటాయి.