గుత్ప ఎత్తిపోతలలో అవినీతి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహ ణ లో 2011 నుంచి కొందరు బినామీలు ‘చిన్న’ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. 2010 నుంచి 2012 వరకు ఏటా రూ.18.59 కోట్లు ఈ పథకం కోసం వెచ్చించారు. పనుల లో అనేక లోపాలు, స్వాహాలు జరిగినా ప్రభుత్వం, అధికారులు బయటపడనీయకుండా జాగ్రత్తగా వ్యవహరించా రు.
తాజాగా ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 25న రూ.55.78 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను 2013 ఆగస్టు 1 నుంచి 2015 జూలై 31 వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం నిర్వహణ, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు, ఇతర మరమ్మతుల కోసం ఏడాదికోసారి బహిరంగ టెండర్లు నిర్వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఓ బడా కంపెనీని రంగంలోకి దింపిన అధికారులు ఆర్మూరుకు చెందిన ఓ కాంగ్రెస్ నేతకు నిధులు ధారదత్తం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
నందిపేట, బాల్కొండ, మాక్లూరు, వేల్పూరు, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన 55 గ్రామాలలో దాదాపు 38,967 ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్వహణ పనులలో పెద్దలు గద్దల్లా వాలారు. రెండేళ్ల నిర్వహణ కోసం నిధులు విడుదలయ్యాక, సాధారణ ఎన్నికలు రావడం, పరిస్థితి మారడంతో అధికారులు ఆగమేఘాల మీద గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు నిర్వహించారు. గత జూలై 1 నుంచి 2015 జూలై 31 వరకు హైదరాబాద్‌కు చెందిన రవి ఎంటర్ప్రెజైస్కు అగ్రిమెంట్ చేసినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
మొక్కుబడి టెండర్లు
నీటి పారుదలశాఖ నిర్వహణలో ఉన్న ఈ పథకంలో ఆర్మూరుకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నేత ఏటా రూ. కోట్లు కాజేస్తున్నట్లు ప్రస్తుత నీటిపారుదలశాఖ మంత్రికి జి ల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల ఫిర్యాదు చేసినట్లు సైతం వార్తలు వచ్చాయి. బినామీ కాంట్రాక్టర్‌గా మూడేళ్లుగా నీటి పథకాల నిర్వహణ పేరిట భారీగా అవకతకవలు పాల్పడుతుండగా, కొందరు అవినీతి అధికారులు ఆయనతో భాగస్వాములు అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో మొక్కుబడి టెండర్లతో బడా కంపెనీల పేరున అగ్రిమెంట్ జరిగినా, ఉప గుత్తేదారులను రంగంలోకి దింపినా, క్రమేపీ సదరు కాంగ్రెస్ నేతే ‘చిన్న’గా కాంట్రాక్టర్‌గా అవతారమెత్తారని సంబంధిత అధికారులే వాపోతున్నారు.
అయినా, ఆయనే
ఈ ఏడాది జూలై ఒకటిన, 12 నెలల కోసం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ పనుల టెండర్లు నిర్వహించినా మళ్లీ అతనే నిర్వహణ బాధ్యతలు చూస్తున్నట్లు నీటి పారుదలశాఖలో చర్చ జరుగుతోంది. మూడేళ్లుగా మరమ్మతులు చేయకుండానే చేసినట్లు గా, క్లోరినేషన్ పద్దుల పేరుతో రూ.కోట్లు దొడ్డిదారిన దిగమింగుతున్నారన్న ఫిర్యాదులున్నా గత ప్రభుత్వం హయాంలో ఎవరూ పట్టించుకోలేదు. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు.