40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. రెడ్‌లైట్ ఏరియాలో అవాక్కైన అధికారులు
పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బీహార్ వ్యాప్తంగా కుల ఆధారిత జనాభా లెక్కింపు చేపట్టింది. దీనికోసం రూ. 500 కోట్లు ఖర్చుపెడుతోంది. రెండు దశల్లో చేపట్టిన ఈ గణన జనవరి 7న ప్రారంభమైంది. మొదటి దశలో రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్యను లెక్కించగా.. రెండవ దశలో వారి కులాలు, ఉపకులాలు, మతాల వివారాలను సేకరిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు.
40 మంది మహిళలు భర్త పేరు ఒక్కటే
తాజాగా అర్వాల్ జిల్లాలో జనాభా లెక్కలకు వెళ్లిన అధికారులకు ఓ దిమ్మతిరిగే సంఘటన ఎదురైంది. ఈ క్రమంలో 40 మంది మహిళలు తమ భర్త పేరును రూప్‌చంద్‌గా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. మరికొంత మంది మహిళలు భర్త పేరే కాకుండా తమ పిల్లల పేర్లను రూప్‌చంద్‌గా తెలిపారు. అర్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని రెడ్‌లైట్ ఏరియాలోఈ వింత ఘటన వెలుగు చూసింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు.
భర్తే కాదు, పిల్లల పేర్లు రూప్చందే
రెడ్‌లైట్ ఏరియాలో చాలా మంది మహిళలు(సెక్స్ వర్కర్లు) డ్యాన్స్‌లు, పాటలు పాడుకుంటూ ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్నారు. అయినా వీరికి శాశ్వత చిరునామా లేదు. వీరిలో 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పారు. చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని తెలిపారు. రూప్‌చంద్‌ను తమ ఆత్మీయుడిగా భావించే కుటుంబాలు డజన్ల కొద్దీ ఉన్నాయి. ఇక్కడో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈరూప్చంద్ ఎవరో, అతనెక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.
ఎవరీ రూప్‌చంద్
కుల గణన చేసేందుకు అక్కడికి వెళ్లిన రాజీవ్ రంజన్ రాకేష్ రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న కొంతమంది మహిళలతో మాట్లాడారు. అక్కడి మహిళల ఆధార్ కార్డులపైన కూడా భర్త పేరు రూపచంద్ అని రాసి ఉందని ఆయన పేర్కొన్నారు. రూప్‌చంద్ ఇక్కడ ఉన్న 40 మంది మహిళలకు ఆత్మీయుడని చెప్పారు. అయితే ఇంతకీ ఈ రూప్‌చంద్ ఎవరు? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు
అసలు విషయం ఇదీ!
రూప్‌చంద్ ఎవరనే విషయంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలు రూప్‌చంద్ వ్యక్తి కాదని తేలింది. డబ్బును రూప్‌చంద్ అంటారు. ఇక్కడ నివసించే మహిళలు రూప్‌చంద్ అంటే రూపాయిని తమ సర్వస్వంగా భావిస్తారు. కాబట్టి వారందరూ తమ భర్త పేరు ముందు రూప్‌చంద్‌గా నమోదు చేసుకున్నట్లు వెల్లడైంది. దీంతో స్త్రీలు రూప్‌చంద్ పేరును భర్త లేదా తండ్రిగా చెప్పడానికి కారణం ఇదేనని తెలిసింది.