ఆశా దీపాలు ఆరిపోయాయి
అనంతపురం క్రైం : పెనుకొండ సమీపంలో జరిగిన బస్సు దుర్ఘటనలో మూడు కుటుంబాల్లో ఆశా దీపాలు ఆరిపోయాయి. ఈ ఘటన మూడు కుటుంబాలకు వంశ వృక్షం లేకుండా చేసింది. ఈ మూడు కుటుంబాల పెద్దలు కూలినాలి చేసుకుని జీవించేవారే. తాము పడుతున్న ఇబ్బందులు తమ బిడ్డలకు రాకూడదనే గంపెడాశతో చదివిస్తూ వచ్చారు. మృత్యువు ఆశలను ఆర్పేసింది. మృతులలో నరేంద్ర అనే ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి చిన్న అంజినప్ప, నరసమ్మ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు.
వీరికి ఎకరా పొలం ఉంది. తండ్రి వ్యవసాయ కూలిగా పనిచేస్తూ కొడుకును చదివిస్తున్నాడు. ఉన్న కొడుకును కోల్పోయి వారు విలపిస్తున్నతీరు అందరికీ కంటతడిని తెప్పించింది. ఇదే గ్రామానికి చెందిన నరసింహమూర్తి అంజినప్ప, రామంజనమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అంజినప్ప వ్యవసాయ కూలి. అయినా కొడుకును ఉన్నత చదువులు చదివించాలని కష్టపడుతున్నాడు.
చివరకు ఆయనకు పుత్రశోకం మిగిలింది. సోమందేపల్లి మండలం ఆనందాపురం గ్రామానికి చెందిన రామాంజనప్ప, ఆనందమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఒక కొడుకు అశోక్‌కుమార్. రామాంజనప్ప వ్యవసాయ కూలిగా పనిచేస్తూ పెనుకొండలో కొడుకును ఇంటర్ చదివిస్తున్నాడు. ఉన్న ఒక్క కొడుకునూ దేవుడు తీసుకెళ్లాడని గుండెలావిసేలా తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఏడ్చిఏడ్చి స్పృహ వారు స్పృహ కోల్పోయారు.
మృతుల ఇళ్ల వద్ద మిన్నంటిన రోధనలు
రొద్దం: కళాశాలకు వెళ్లోస్తామని చెప్పి బయలుదేరిన విద్యార్థులు క్షణాల్లోనే వారిని మృత్యువు కబలిస్తుందని తాము ఊహించలేదని మృతుల కుటుంబ సభ్యుల రోధనలను ఆపడం ఎవరి తరమూ కాలేదు. బుధదారం మడకశిర-పెనుకొండ మార్గంలో జరిగిన ప్ర మాదంలో మావటూరు, బండమీదప ల్లి, నాగళూరు, రొద్దం మండలం బొమ్మిరెడ్డిపల్లి, చెరుకూరు, సోమందేపల్లి మండలం ఆనందాపురం తదితర గ్రామాల విద్యార్థులు మృతి చెందారు. వారి ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు, బం ధువులు కన్నీమున్నీరుగా విలపించా రు.
మృతులలో రొద్దం మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెదిన ఆరోతరగతి విద్యార్థి మురళి, చెరుకూరు గ్రామానికి చెందిన అనిత ఇంటర్ ద్వితీయ సంవత్సరం,పెనుకొండ మండలం మావటూరు చెందిన అనిల్ ఇంటర్ ప్రథమ,ఉప్పర గంగాధర్ ఇంటర్ ద్వితీయ,నాగళూరు శేఖర్ ఇంటర్ ద్వితీయ, నాగలూరుకు చెందిన లక్ష్మినారాయణ డిగ్రీ, మావటూరుకు చెందిన కురుబ గంగాద్రి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు.
చెల్లాచెదురుగా పుస్తకాలు, ఐడీ కార్డులు
అనంతపురం క్రైం : ప్రమాద స్థలంలో ఎక్కడ చూసిన విద్యార్థుల పుస్తకాల బ్యాగులు, ఐడీ కార్డులు కనిపించాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు, బ్యాగులు, క్యారియర్లలతో తెచ్చుకున్న అన్నం, బ్యాంకు పాసుప్తుకాలు కనిపించాయి. వాటిని చూసివారు చలించిపోయారు. అక్కడికి వచ్చిన పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది విద్యార్థుల ఐడీ కార్డులు, బ్యాంకు పాసు పుస్తకాలు అన్నీ సేకరించారు. ప్రిన్సిపాల్ వద్ద ఉంచుతామని ఎవరైనా సంబంధికులు వచ్చి తీసుకెళ్లవచ్చని తెలిపారు.