జడ్పీ సీఈవోను వెంటాడుతున్న అవినీతి
సాక్షి, సంగారెడ్డి: జడ్పీ సీఈఓ బి. ఆశీర్వాదంను ‘టేక్ వుడ్’ వెంటాడుతోంది. బాపట్లలోని ‘ఎక్స్‌టెన్షియన్ ట్రైనింగ్ సెంటర్’ ప్రిన్సిపాల్‌గా ఆయన 2009-12 మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో కళాశాల క్వార్టర్లకు సంబంధించిన టేక్ వుడ్ తలుపులు, కిటికీలతోపాటు విలువైన ఆస్తులు మాయమయ్యాయి. తదనంతరం బాధ్యతలు స్వీకరించిన కళాశాల ప్రిన్సిపాల్ ఈ అంశాన్ని తన నివేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాజేందర్ నగర్(హైదరాబాద్)లోని ఎక్స్‌టెన్షియన్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్స్‌పాల్ రంగా ద్వారా ప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపించగా టేక్‌వుడ్, ఇతర ఆస్తులు దుర్వినియోగమైనట్లు రుజువైంది.
ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి 2012 జూన్ 25న నివేదిక అందజేశారు. దీంతో ప్రభుత్వం ఏఎంఆర్-అపార్డ్ సంస్థ అధినేత ప్రసాద్‌తో దర్యాప్తు జరిపించగా ఆయన అదే ఏడాది డిసెంబర్ 5న ప్రభుత్వానికి సమగ్ర దర్యాప్తు నివేదిక సమర్పించారు. నివేదికల ఆధారంగా ఆశీర్వాదంపై ఆస్తుల దుర్వినియోగం ఆరోపణలను మోపుతూ గురువారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి వి. నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
నాకేం సంబంధం లేదు
బాపట్లలోని క్వార్టర్లకు సంబంధించిన టేక్‌వుడ్ తలుపులు, కిటికీలు మాయమైన విషయంలో నన్ను అకారణంగా ఇరికించారు. నేను బాధ్యతలు స్వీకరించే నాటికే అక్కడ కిటికీలు, తలుపులు లేవు. ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో నా హోదాకు సమాన హోదా, తక్కువ హోదా కలిగిన అధికారులతో విచారణ జరిపించడం ఎంతవరకు సబబు? నాకు ఎలాంటి నోటీసులూ పంపలేదు.
- జడ్పీ సీఈఓ బి. ఆశీర్వాదం