74 ఏళ్ల కుర్రాడు
74 ఏళ్ల వయసులో చాలామందికి నడవడమే కష్టం. ఓ మూలన కూర్చొని కృష్ణా... రామా అంటూ శేష జీవితం గడిపేస్తుంటారు. సొంతంగా తన పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే నడవడానికే కష్టమైన ఈ వయసులో... బెజవాడకు చెందిన ఓ వృద్ధుడు అంతర్జాతీయ యవనికపై అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బద్ధకంగా కదిలే టీనేజ్ కుర్రాళ్లకు కనువిప్పు కలిగేలా అథ్లెటిక్స్‌లో అచ్చెరువొందే విజయాలు సాధిస్తున్నాడు.
మైదానంలో ఆయన్ని చూస్తే... పరుగెత్తుతున్న కుర్రాడు కూడా ఓ క్షణం ఆగిపోతాడు. అథ్లెట్లయితే ఆ పరుగు పూర్తయ్యే వరకు ఆయన్నే అనుసరిస్తారు. జాగింగ్ చేస్తున్న వారు కూడా ఆ క్షణం పరుగెత్తేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే 74 ఏళ్ల ఎస్. పద్మనాభన్ ప్రాక్టీస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. లేటు వయసు (54 ఏళ్లలో)లో అంతర్జాతీయ యవనికపైకి దూసుకొచ్చినా ఘాటుగా తన సత్తాను చూపిస్తున్నారు. వెటరన్ (70+) విభాగంలో ఆసియా స్థాయిలో ఇప్పటికే 17 పతకాలు సొంతం చేసుకున్నారు. ఇందులో 3 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. 8వ ఆసియా చాంపియన్‌షిప్‌తో ప్రారంభమైన ఈయన జైత్రయాత్ర ఇంకా కొనసాగుతోంది. మధ్యలో ఒకటి, రెండు (15, 16వ చాంపియన్‌షిప్) మిస్ అయినా ఎక్కువ ఈవెంట్లలో తన లక్ష్యాన్ని సాధించారు. 200 మీటర్లు (30 సెకన్లు), 300 మీటర్ల హర్డిల్స్ (50 సెకన్లు), 80 మీటర్ల హర్డిల్స్ (16.1 సెకన్లు)లలో బరిలోకి దిగే ఆయన 4ఁ100, 4ఁ400 రిలేలో పాల్గొనే భారత్ జట్టుకు ఫినిషింగ్ టచ్‌నూ ఇస్తారు.
ఇంతకీ ఎవరితను?
విజయవాడకు చెందిన పద్మనాభన్... ఏపీఎస్ఆర్టీసీలో డివిజనల్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. పిల్లలంతా వాళ్ల... వాళ్ల కెరీర్లో స్థిరపడిన తర్వాత ‘ఆట’ మొదలుపెట్టారు.. చిన్నప్పుడు క్రికెట్, ఫుట్‌బాల్ ఆటల్లో ప్రావీణ్యం ఉండటం, శరీరం కూడా అనువుగా ఉండటంతో 1990లో అథ్లెటిక్స్‌పై దృష్టిపెట్టారు. అలా మెల్లగా మొదలైన కసరత్తులు ఈవెంట్లలో పతకాలు సాధించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే మూడు అంశాలు ‘అంకితభావం, ఆహారం, క్రమశిక్షణ’ గురించి చెబుతారు.
జపాన్ను కొట్టాలి!
చైనా, కొరియాలపై సులువుగా గెలిచినా... జపాన్ను మాత్రం ఓడించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసే పద్మనాభన్ ఆ లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించనంటారు. జూలైలో జపాన్‌లో జరగబోయే 18వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఈ టోర్నీకి అర్హత సాధించాలంటే ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు కోయంబత్తూరులో జరిగే జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో సత్తా చాటాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ‘ఫీల్డ్‌లోకి ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా... ఏం చేశామన్నదే ముఖ్యం’ ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను పద్మనాభన్ తన నిజ జీవితంలో చేసి చూపిస్తున్నారు. ఏదేమైనా మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ అథ్లెట్ తాతయ్యకు ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే.
- ఆలూరి రాజ్‌కుమార్, (సాక్షి స్పోర్ట్స్, విజయవాడ)
హైదరాబాద్‌లో ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ ఇంజ నీర్‌గా పనిచేస్తున్న సమయంలో 1988లో లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన జాతీయ వెటరన్ అథ్లెటిక్ మీట్ చూశాను. అప్పటి నుంచి అథ్లెటిక్స్ మీద ఆసక్తి పెరిగింది. 1990లో తొలిసారి మలేసియాలో మీట్‌కు వెళ్లాను. అందులో నాలుగో స్థానం వచ్చింది. 1992 నుంచి పాల్గొన్న ప్రతి మీట్లో ఏదో ఒక పతకం సాధించా. ఆర్టీసీలో వర్క్స్ మేనేజర్‌గా పనిచేసిన రాజగోపాల్ గారు నా గురువు. వర్షం వచ్చినా, వాతావరణం ఎలా ఉన్నా ప్రాక్టీస్ ఆపకూడదు. మనం పాల్గొనే పోటీల్లో ఉత్తమ టైమింగ్ ఎంత? మన టైమింగ్ ఎంత? ఈ రెండు అంశాలను బేరీజు వేసుకుని ప్రాక్టీస్ చేయాలి. నాలాంటి చిన్న పెన్షనర్లకు విదేశాలకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న పనే. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా.. మక్కువను చంపుకోలేం కదా. - పద్మనాభన్
సాధించిన ఘనతలు
1994 జకర్తాలో జరిగిన 8వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజతం
1996 సియోల్‌లో జరిగిన 9వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం, కాంస్యం.
1998 ఒకినోవాలో జరిగిన 10వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, కాంస్యం.
2000 బెంగళూరులో జరిగిన 11వ ఆసియా వెటరన్ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు.
2002 చైనాలో జరిగిన 12వ ఆసియా వెటరన్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం.
2004 బ్యాంకాక్‌లో జరిగిన 13వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం.
2006 బెంగళూరులో జరిగిన 14వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఒక రజతం.
2012 చైనాలో జరిగిన 17వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు.
నాలుగు బిస్కెట్లు...
తన ఫిట్‌నెస్‌కు మితాహారమే కారణమనే పద్మనాభన్... తన దినచర్యలో కూడా కచ్చితమైన నియమాలను పాటిస్తారు. ఉదయం కాఫీతో పాటు నాలుగు మ్యారీ గోల్డ్ బిస్కెట్లు తీసుకుంటారు. మధ్యాహ్నం కప్ రైస్, పప్పు, సాంబార్, కూరగాయలు, ఒక ఫ్రూట్‌ను లంచ్‌గా తీసుకుంటాడు. డిన్నర్లో కూడా వీటినే కొనసాగిస్తారు. అయితే ఎక్కడున్నా... వాతావరణం ఎలా ఉన్నా... రోజుకు గంటన్నర ప్రాక్టీస్ తప్పనిసరి.