ఎయిర్పోర్ట్ నుంచి బయటకొచ్చి దొరికిపోయారు
బెంగుళూరు : బంగారు బిస్కెట్లు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో గుజరాత్‌కు చెందిన ఆసీఫ్ భాటియా, జి.గణేశ్ ఉన్నారు. వీరు బంగారు బిస్కట్లను ఎయిర్‌పోర్టులో చెకింగ్ అధికారుల కళ్లగప్పి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్టు బయట వీరిద్దరూ పరస్పరం తిట్టుకుంటూ ఘర్షణ పడుతుండడంతో పోలీసులు అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
బెంగళూరులో బంగారానికి ధర ఎక్కువగా ఉందని తెలుసుకున్న ఆసీఫ్ భాటియా రూ. 54 లక్షలు విలువ చేసే బంగారు బిస్కట్లను జి.గణేష్‌కు ఇచ్చి వీటిని సురక్షితంగా బెంగళూరుకు చేరిస్తే రూ. 15 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే బంగారాన్ని గణేష్ ఎయిర్‌పోర్టు దాటించాడు.
తనకు ఇస్తానన్న రూ. 15 వేలు ఇస్తే బంగారు బిస్కట్లు ఇస్తానని గణేష్ తేల్చి చెప్పడంతో, ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని, బంగారు బిస్కట్లు ఇస్తే డబ్బు తర్వాత ఇస్తానని నమ్మబలికాడు. ఇందుకు గణేష్ అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడి పోలీసులకు చిక్కారు. ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి రెండు బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు.