Asrani
-
మోదీ షోలే సినిమాలో అస్రానీ: ప్రియాంక
మిర్జాపూర్/గోరఖ్‌పూర్(యూపీ): నరేంద్ర మోదీ ఒక నటుడని, ప్రధాని పదవికి అమితాబ్ బచ్చన్ సరైన వ్యక్తి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. అమితాబ్ నటించిన షోలే సినిమాలోని ‘అస్రానీ’ పాత్ర మోదీకి సరిపోతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం మిర్జాపూర్, గోరఖ్‌పూర్‌లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె పాల్గొన్నారు. ‘ప్రధాని మోదీ నాయకుడు కాదు, ఒక నటుడు. అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిగా చేస్తే బాగుంటుంది. ‘బ్రిటిష్ వారి కాలంలో...’ అంటూ కనిపించిన ప్రతిసారీ ఒకే డైలాగ్ చెప్పే షోలే సినిమాలో అస్రానీ పాత్ర లాంటివాడు మోదీ. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ ఏం చేశారో ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. గత ఐదేళ్లలో తను ఏం చేసింది మాత్రం ఎన్నడూ చెప్పరు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల్లో ఒక్కటీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ‘నోట్లరద్దుతో నల్లధనం వెనక్కివస్తుందని చెప్పారు. నల్లధనం తీసుకురాలేకపోయారు. దానివల్ల కష్టాలు మాత్రం వచ్చాయి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం బలహీనం చేసిందని ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన బీమా సొమ్ము పారిశ్రామికవేత్తలకు, బీమా కంపెనీలకు చేరిందని విమర్శించారు. -
అస్రానీ....
కమెడియన్ అస్రానీది లౌడ్ కామెడీ. పెద్ద పెద్దగా అరవడం ద్వారా కామెడీ పండించే నటులలో అస్రానీ ఒకడు. కాని అతడిలో చాలా మంచి నటుడున్నాడన్న సంగతి హృషికేశ్ ముఖర్జీ కనిపెట్టి ‘గుడ్డీ’, ‘బావర్చీ’, ‘చుప్ కే చుప్ కే’, ‘అభిమాన్’ వంటి సినిమాల్లో చాలా మంచి వేషాలిచ్చాడు. అస్రానీకి ‘షోలే’ ఎంత మేలు చేసిందో అంతే కీడు చేసింది. ఆ సినిమాలో అతడు పోషించిన జైలర్ పాత్రను వదలని ప్రేక్షకుడు అదే మాడ్యులేషన్లో అతడి నుంచి కామెడీ ఆశించారు. ఇప్పటికీ ఆ మూసలోనే దర్శకులు చేయిస్తూ ఉన్నారు. అస్రానీ సింధీ కుటుంబానికి చెందినవాడు. విభజన తర్వాత కుటుంబం పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చేసింది. కార్పెట్లు అమ్మడం, లెక్కలు చూడటం ఇష్టం లేక సినిమాల మీద పడ్డాడు. అమితాబ్, అస్రానీ ఒకే బిల్డింగ్‌లో చెరో రూమ్‌లో ఉండి వేషాలకు ప్రయత్నించేవారు. అస్రానీ హిందీ సినిమాల్లో కామెడీ చేసినా గుజరాతీ సినిమాల్లో హీరోగా రాణించాడు. సినిమాల్లో సంపాదించింది మళ్లీ సినిమాలు తీసి పోగొట్టుకున్నాడు. అయినా సుదీర్ఘకాలంగా కామెడీలో రాణిస్తున్న నటుడిగా గౌరవం పొందుతున్నాడు. మహేశ్‌బాబు తొలి సినిమా ‘రాకుమారుడు’లో అస్రానీ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.