Assam ballers
-
అస్సాంతో రంజీ మ్యాచ్ డ్రా
గువాహటి: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. అస్సాంపై ఆధిక్యాన్ని సాధించలేకపోయారు. దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో అస్సాం ఖాతాలో 3 పాయింట్లు చేరగా, హైదరాబాద్‌కు ఒక పాయింట్ దక్కింది. 218/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 132.2 ఓవర్లలో 370 పరుగులకు ఆలౌటైంది. అస్సాం బౌలర్లు సమష్టిగా రాణించి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బవనక సందీప్ (221 బంతుల్లో 113, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ అమోల్ షిండే (1), రవితేజ (3) ఘోరంగా విఫలమవడంతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ఆటగాడు లేకపోయాడు. ఈ దశలో సందీప్, ఆశిష్ రెడ్డి (65 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో సెంచరీ పూర్తి చేశాడు. అస్సాం బౌలర్లలో అబూ నెచిమ్, అరూప్ దాస్, సయ్యద్ మహ్మద్, తర్జిందర్ సింగ్ తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం జట్టుకు 131 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. ఓపెనర్ పల్లవ్ కుమార్ దాస్ (3) రనౌట్ కాగా, మరో ఓపెనర్ శివ శంకర్ రాయ్ (9 నాటౌట్), కునాల్ సైకియా (7 నాటౌట్) అజేయంగా నిలిచారు. హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్‌లో మహారాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ 14 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. సంక్షిప్త స్కోర్లు: అస్సాం తొలి ఇన్నింగ్స్: 501; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 370 (సుమన్ 126, సందీప్ 113; తర్జిందర్ 2/35, అరూప్ దాస్ 2/68), అస్సాం రెండో ఇన్నింగ్స్: 20/1 -
సుమన్ సిక్సర్ల మోత
గువాహటి: హైదరాబాద్ ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (170 బంతుల్లో 126, 9 ఫోర్లు, 9 సిక్సర్లు) జూలు విదిల్చాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా బార్సాపర స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో అతను అస్సాం బౌలర్ల పాలిట సిక్సర్ల పిడుగయ్యాడు. చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో హైదరాబాద్ జట్టు దీటైన జవాబిస్తోంది. అంతకుముందు శనివారం 422/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 197 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 501 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే సయ్యద్ మహ్మద్ ( 133 బంతుల్లో 59, 7 ఫోర్లు)ను రవికిరణ్ బోల్తాకొట్టించాడు. తర్వాత టెయిలెండర్లు కునాల్ (4), అబు నెచిమ్ అహ్మద్ (6), అరూప్ దాస్ (19 నాటౌట్)ల అండతో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్, సెంచరీ హీరో గోకుల్ శర్మ (332 బంతుల్లో 161 నాటౌట్, 21 ఫోర్లు) జట్టు స్కోరును 500 పరుగులు దాటించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి అతను అరూప్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ అక్షత్ రెడ్డి (132 బంతుల్లో 39, 5 ఫోర్లు)తో కలిసి సుమన్ ప్రారంభించాడు. ఇద్దరు మొదట నింపాదిగా ఆడారు. తర్వాత సుమన్ బ్యాట్ ఝులిపించడం మొదలుపెట్టాడు. వీలు చిక్కిన బంతినల్లా బౌండరీకి తరలించాడు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అక్షత్ నిష్ర్కమణ తర్వాత వచ్చిన విహారి (81 బంతుల్లో 34, 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులకు చేర్చాడు. జట్టు స్కోరు 201 పరుగుల వద్ద సుమన్, విహారీలిద్దరు ఔట్ కావడంతో స్కోరు వేగం మందగించింది. ఆకాశ్ భండారీ (9) కూడా నిష్ర్కమించడంతో ఆటముగిసే సమయానికి హైదరాబాద్ 71 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. సందీప్ (8), షిండే (0) క్రీజులో ఉన్నారు. నేడు (ఆదివారం) ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమే. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరం. సంక్షిప్త స్కోర్లు అస్సాం తొలి ఇన్నింగ్స్: 501/9 డిక్లేర్డ్, హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 218/4 (సుమన్ 126, అక్షత్ 39, విహారి 34)