అస్సాం వరద మృతులు 102
బిహార్లో 41 మంది, నేపాల్లో 80 మంది మృతి
కఠ్మాండు/ఢాకా/గువాహటి: భారీ వర్షాలు అస్సాం, బిహార్ రాష్ట్రాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సోమవారం ముగ్గురు సహా ఈ వర్షాకాలంలో అస్సాంలో 102 మంది మరణించారు. బిహార్లో మొత్తం 41 మంది చనిపోయారు. అస్సాంలో 3,192 గ్రామాలు, 1.79 లక్షల హెక్టార్లలో పంటలు నీటముని గాయి. 31.59 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. అటు బిహార్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం నితీశ్ కుమార్ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు.
అస్సాం, బిహార్లలో వరద సరిస్థితిపై ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం చేస్తామని అభయమిచ్చారు. బెంగాల్, బిహార్, అస్సాం, పలు ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా రైలు పట్టాల కింద మట్టి, రాళ్లు కొట్టుకుపోవడంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లనూ బుధవారం ఉదయం 10 గంటల వరకు రద్దు చేశారు.
నేపాల్లో ఒక్కరోజే 14 మంది...
వరదలు పొరుగు దేశాలు నేపాల్, బంగ్లాదేశ్లను కూడా వణికిస్తున్నాయి. నేపాల్లో సోమవారం కొండచరియలు విరిగిపడి 14 మంది మరణించారు. దీంతో వరద మృతుల సంఖ్య 80కి చేరింది. చితవాన్ జాతీయ పార్కులో చిక్కుకుపోయిన 35 మంది భారతీయులను మచ్చిక ఏనుగుల సాయంతో రక్షించారు. బంగ్లాదేశ్లో ఎడతెరిపిలేని వాన లు పడుతుండటంతో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు ఇప్పటివరకు బంగ్లాదేశ్లో 27 మంది మరణించారు.