సీట్లు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి పార్టీ సీనియర్లకు, మాజీ మంత్రులకు షాక్ ఇచ్చారు. జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. కేవలం 18 మంది మాజీలకు మాత్రమే మళ్లీ జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. తాము అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని, తమ బంధు మిత్రులకు సీట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే ప్రసక్తే లేదని లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్ల గ ల్లంతు కరుణానిధిని డీలా పడేలా చేసింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా జిల్లాల శాఖల్ని విభజించే పనిలో పడ్డారు. ఇది వరకు పార్టీ పరంగా 35గా ఉన్న జిల్లాల సంఖ్యను 65కు చేర్చారు. యూనియన్, నగర, డివిజన్, జిల్లా స్థాయి కార్యవర్గాల ఎంపిక ను ఎన్నికల ద్వారా నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే, ఈ ఎన్నికలు వివాదాలకు దారి తీసి పార్టీ పరువు బజారుకెక్కేందుకు మార్గంగా మారింది. జిల్లా స్థాయి కార్యదర్శుల ఎంపిక మాత్రమే జరగాల్సి ఉంది. ఒక్కో జిల్లాలో ఇద్దరు ముగ్గురు నేతలు బరిలో ఉండడంతో వివాదాలు మరింత తారా స్థాయికి చేరే పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో పరిస్థితి కట్టడి చేయడంతో పాటుగా నేతలకు షాక్ ఇచ్చే విధంగా కరుణానిధి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీకి సేవల్ని అందించిన కేవలం 18 మంది నాయకులకు మాత్రం మళ్లీ జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చారు. ఇక జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందే వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు లేవని తేల్చారు. అలాగే, వారి బంధు మిత్రులకు సైతం సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చుతూ ఎన్నికల బరిలో నిలబడే వారి నుంచి హామీ పత్రం స్వీకరించేందుకు నిర్ణయించారు. పార్టీ వర్గాల్ని తీవ్రంగా మందలిస్తూనే, పార్టీ తీసుకున్న నిబంధనల మేరకు నడచుకునే వాళ్లకే జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ పదవుల్లో పోటీకి అవకాశం ఇస్తామని బుధవారం కరుణానిధి ప్రకటించడంతో డీఎంకే వర్గాలకు షాక్ తగిలింది.
బాధ్యులు మీరే: లోక్సభ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లు గల్లంతు కావడానికి కారణాలను విశ్లేషిస్తూ పలు పత్రికలు, మీడియాల్లో వచ్చిన కథనాల్ని గుర్తు చేశారు. పార్టీ అభ్యర్థుల ఓటమికి అనేక జిల్లాల కార్యదర్శలే కారణం అంటూ పలు పత్రికలు కథనాలు ప్రచురించాయన్నారు. అదే, ఇతర పార్టీల్లో అయితే, అలాంటి నేతలకు ఉద్వాసనలు పలికారని, తాను అలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, తప్పు చేసిన వాళ్లను సైతం క్షమించానన్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా,ప్రజా స్వామ్యబద్దంగా జరుగుతున్న ఎన్నికల్ని వివాదం చేయడాన్ని చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అందుకే తాను , పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామన్నారు.
18 మందికే అవకాశం : పార్టీ పరంగా 65 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఇది వరకు కార్యదర్శులుగా ఉన్న వాళ్లు, మాజీ మంత్రులుగా, ఎంపీలుగా పదవుల్ని అనుభవించిన వాళ్లు సైతం కార్యదర్శుల పదవికి పోటీ పడుతున్నారని వివరించారు. పాత వాళ్లే మళ్లీ మళ్లీ ఎన్నికవుతుంటే, ఇక కొత్త వాళ్లకు ఎలా అవకాశం ఇవ్వగలమని ప్రశ్నించారు. అందుకే జిల్లా కార్యదర్శుల పదవులకు పోటీ చేసే వాళ్లకు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చామన్నారు. పార్టీ కోసం సేవల్ని అందిస్తూ ముందుకు సాగుతున్న 18 మంది నాయకులకు మాత్రమే మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చామని, వీరు చట్ట సభల ఎన్నికల్లో పోటీ చేయరని స్పష్టంచేశారు.
మిగిలిన చోట్ల అసెంబ్లీ, ఎంపీ సీట్లు వద్దు అనుకునే వాళ్లు జిల్లా కార్యదర్శులకు పోటీ చేసుకోవచ్చని సూచించారు. జిల్లా కార్యదర్శుల పదవులకు, రాష్ట్ర పార్టీలోని కొన్ని పదవులకు పోటీ చేయదలచిన వాళ్లు తాము అసెంబ్లీ, ఎంపీ సీట్లను ఆశించేది లేదని హామీ పత్రాన్ని పార్టీకి అందించాల్సి ఉంటుందన్నారు. కరుణ ప్రకటన పార్టీ వర్గాల్ని డోలాయమానంలో పడేసింది. జిల్లా కార్యదర్శుల పదవుల్లో గెలిచినా, సీట్లు ఇవ్వబోమని కరుణానిధి స్పష్టం చేయడంతో ఇక పదవి కన్నా, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లే ముఖ్యం అన్నట్టుగా ఆ ఎన్నికల నుంచి తప్పుకునేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. పార్టీ కార్యాలయ నిర్వాహక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎంఆర్కే పన్నీరు సెల్వం ఆ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు, ఆ పదవిని కేఎన్ నెహ్రు చేపట్టనున్నట్లు అరివాళయంలో చర్చ బయల్దేరింది.