ఎన్నికల వేఢీ
విశాఖపట్నం : జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిన్నమొన్నటివరకు సమైక్య ఉద్యమాలతో అట్టుడికిన జిల్లా ఇప్పుడు రాజకీయసందడితో రంజుగా మారుతోంది.
మున్సిపల్ ఎన్నికలు, ఆ వెంటనే అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాజకీయపార్టీలు పోటాపోటీగా గ్రామాల్లో ఇప్పటినుంచే ప్రచార వ్యుహా లు రచిస్తున్నారు. ఎన్నికల
ఏర్పాట్లతో ప్రభుత్వ కార్యాలయాల్లో బిజీ వాతావరణం నెలకొంది. రానున్న సాధారణ ఎన్నికలకోసం మొత్తం 3,506 పోలింగ్స్టేషన్లను అధికారులు ఖరారుచేశారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 40 పోలింగ్ కేంద్రాలు అదనంగా పెరిగాయి. అవసరమైన ఈవీఎంలు 16వేలు దఫదఫాలుగా జిల్లాకు చేరుతున్నాయి.
అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌తో యలమంచిలి, నర్సీపట్నంలలో సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వీటికి ఈనెల 30న పోలింగ్ ఉంటుంది. 10నుంచి నామినేషన్ల స్వీకరిస్తారు.
ఇవి పూర్తయిన కొద్దిరోజులకే అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. దీంతో ఇప్పటికే జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3,506 పోలింగ్ స్టేషన్లు అవసరమని అధికారులు తేల్చారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 40స్టేషన్లు పెరిగాయి. ఈవీఎంలు 16 వేలుఅవసరం. 3వేలు వరకు సిద్ధంగా ఉన్నట్లుఅధికారులు చెబుతున్నారు.
సాధారణ ఎన్నికలకు 25వేల మంది పోలింగ్ సిబ్బంది అవసరమని గుర్తించారు. పోలింగ్ కేంద్రాలయిన పాఠశాల,ఇతర భవనాల తనిఖీ దాదాపు పూర్తయింది. నియోజక
వర్గాల్లో సెక్టోరల్ అధికారుల నియమాకం కొలిక్కి వస్తోంది. వార్డులు,గ్రామాల వారీగా అధికారులను నియమించి పోలింగ్‌ను వీడియోల ద్వారా చిత్రీకరణపై శిక్షణ మొదలు పెట్టనున్నారు.
పోలీసుశాఖ శరవేగంగా కదులుతోంది. 5వేల మంది పోలీసులు,రెండుహెలికాప్టర్లతో నిఘాకు ఏర్పాట్లుచేస్తోంది. విశాఖతోపాటు,జిల్లాలోను పాతనేరస్తులు,రౌడీషీటర్ల జాబితాను రూపొందిస్తున్నారు.
ఈనెల 30న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, యలమంచిలి పట్టణాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు సమైక్యాంధ్ర ఉద్యమంతో హోరెత్తిన పల్లెలు,టిక్కెట్లు ఆశిస్తోన్న అభ్యర్థుల ముందస్తు ప్రచారాలు,కటౌట్లు,హోర్డింగ్‌లతో కొత్తరంగు పులుముకున్నాయి.
అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల ఆశావహులు జెండాలు, బ్యానర్లతో ఇప్పటికే రహదారులను నింపేశారు. కొందరైతే ప్రచారం మొదలుపెట్టకపోయినా ఆంతరంగిక సమావేశాలు, మద్దతు కోసం సామాజికవర్గ సమీకరణ మంత్రాంగాలు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల నేరుగా తమ అనుచరులతో అప్పుడే ప్రచారం ప్రారంభించేశారు.
ప్రచారానికి గడువు సరిపోతుందో లేదోననే ముందుచూపుతో కొందరు ఏదొక కార్యక్రమం పేరుతో ఇంటింటికి తిరుగుతున్నారు. కాంగ్రెస్,టీడీపీల తరపున అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటినుంచే ఎన్నికల ఖర్చుకు అవసరమైన నిధుల సమీకరణకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
నర్సీపట్నం,యలమంచిలి మున్సిపాల్టీలో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. వైఎస్సార్సీపీకి అనుహ్యరీతిలో ప్రజలనుంచి ఆదరాభిమానాలు లభిస్తుండగా, రాష్ట్ర విభజనకు కారకులంటూ కాంగ్రెస్, టీడీపీల వారిని ప్రజలు కనీసం దగ్గరకు రానీయడంలేదు. దీంతో ఏదోలా ప్రజాభిమానం సంపాదించుకునేందుకు ఆయా పార్టీల నేతలు,అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు.