నేల వీడి సాము వద్దు
ముంబై: ఉప ఎన్నికల ఫలితాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలని శివసేన తన భాగస్వామ్యపక్షమైన బీజేపీకి హితవు చెప్పింది. ఉప ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బలను చూసైనా కాళ్లు నేలపై మోపాలని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పలితాలు ఎదురైన సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో తన సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది.
దీనిపై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో విరుచుకుపడింది. ఈ ఫలితాలు ఆశ్చర్యకరం, ఊహించని షాక్ అని పేర్కొంది.‘ప్రజలను తేలికగా తీసుకోవద్దు. ఈ ఫలితాలు అందరికీ ఓ గుణపాఠం కావాలి. ఓటర్ల మనస్సు చంచలమైనది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం. లోక్సభ ఎన్నికల్లో లభించిన విజయంతో గాలిలో ఎగరకండి. నేల విడిచి సాము చేస్తే.. ఫలితాలు ఇలాగే ఉంటాయి.. ఇకనైనా కాళ్లు నేలపై మోపండి లేదా ప్రజలు చమ్డాలు వలిచేస్తా రు’ అంటూ ఘాటుగా విమర్శించింది.
ఈ గుణపాఠం నేర్చుకున్న వారే మహారాష్ట్రలో గెలుపొందుతారని, లేదా ప్రజలే ఆ గుణపాఠం నేర్పుతారని హితవు పలికింది. బీజేపీకి గట్టి పట్టున్న ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లలోనే ఆ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 23 సీట్లలో బీజేపీ 13 స్థానాలను తన ప్రత్యర్థులకు కోల్పోయింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఆశ్చర్యకరమైన విజయాలను నమోదు చేసింది. ఉప ఎన్నికల ఫలితాలను మోడీ హవాతో ముడిపెట్టకూడదని సామ్నా పేర్కొంది. సార్వత్రిక, రాష్ట్రస్థాయి ఎన్నికలకు తేడా ఉంటుందని తెలిపింది.
స్వామీ ఆదిత్యనాథ్ ‘లవ్ జీహాద్’ అంశాన్ని లేవనెత్తారని, కానీ ఆ ప్రభావం ఉప ఎన్నికలపై పడలేదని సామ్నా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ సాధించిన విజయాలకు సోనియా లేదా రాహుల్ గాంధీలను ఎవరూ బాధ్యులు చేయడం లేదని, అలాగే ఇది మోడీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని కూడా నిర్ధారించకూడదని పేర్కొంది. వచ్చేనెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను డిమాండ్ చేస్తున్న బీజేపీ గొంతు నొక్కేందుకే శివసేన తన అధికార పత్రికలో ఈ విధంగా విరుచుకుపడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
త్వరగా తేల్చండి: ఎస్సెస్సెస్
ముంబై : ప్రతిపక్ష కూటమి ‘మహాయుతి’లో సీట్ల పంపకాలపై ఒక ఒప్పందం కుదరకపోవడం పట్ల స్వాభిమానీ షేట్కారీ సంఘటన్ అసహనం వ్యక్తం చేసింది. సీట్ల పంపకంపై శివసేన, బీజేపీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలని సంఘటన్ నాయకుడు రాజుశెట్టి కోరారు. ఒప్పందం ఖరారులో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను బీజేపీ విరమరించాలని ఆయనసూచించారు.
సీట్ల పంపకంపై సేన, బీజేపీల మధ్య చర్చలు వేగవంతం చేయాలని ఆర్పీ నాయకుడు రాందాస్ ఆఠవలే కోరారు. ఆయన బుధవారం సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకుని తమకు 13 సీట్లు కావాలని కోరారు. రాష్ట్ర ప్రజలు మహాయుతి వైపు చూస్తున్నారని ఆఠవలే పేర్కొన్నారు. అందువల్ల త్వరగా సీట్ల పంపకాన్ని పూర్తి చేసుకొని ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. సీట్ల సంఖ్యపై బీజేపీ మొండి పట్టుదలకు పోతూ పొత్తుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆఠవలె ఆరోపించారు.