assembly positions
-
పొత్తు చిచ్చు
సాక్షి, ఏలూరు : ఎవరికి ఏ సీటు వస్తుందో.. ఎక్కడి నుంచి పోటీ చేయాలో.. అసలు సీటు వస్తుందో లేదో అని తెలుగుదేశం పార్టీ ఆశావహులు ఇప్పటికే మదనపడుతున్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటం వారిని కలవరపరుస్తోంది. తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయోననే భయం తెలుగు తమ్ముళ్లకు పట్టుకుంది. పొత్తుల నేపథ్యంలో బీజేపీ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక లోకసభ స్థానాన్ని కోరుతున్నట్లు సమాచారం. అదే జరిగితే పదవుల కోసం పార్టీలు మారిన వారి అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ఓ వైపు ఎవరినిబడితే వారిని పార్టీలోకి ఆహ్వానించి సొంత వాళ్లకు పొగబెట్టడంతోపాటు పార్టీలో చేరిన వాళ్లనూ వంచించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో నిత్య అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు పైకి మాత్రం నిన్నటివరకూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పార్టీ అబాసు పాలవుకుండా కాపుకాశారు. కానీ అధిష్టానం పొత్తుల వైపు చూడటం నాయకుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తోంది. నమ్మినవారిని వంచించడం తమ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిసినప్పటికీ ఇన్నాళ్లూ ఆయననే నమ్ముకున్న వాళ్లు బీజేపీ పొత్తు నిర్ణయంతో కొత్త చిక్కుల్లో పడ్డారు. నిన్నమొన్నటి వరకూ సీటు తమదేననే ధీమాతో ఉన్న వారు సైతం తాజా పరిణామాలతో తలలు పట్టుకుంటున్నారు. తమ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేస్తే ఇక సహించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఏలూరు అసెంబ్లీ స్థానం బడేటి కోట రామారావుకు ఖరారైనట్టే. లోక్‌సభ స్థానం నుంచి మాగంటి బాబు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఏలూరులో ఏ సీటు ఇవ్వాలన్నా సమస్య జఠిలమవుతుంది. కోటగిరి శ్రీధర్ లోక్‌సభా స్థానం పోటీకి మొగ్గుచూపుతున్నారు. దీంతో మాగంటి బాబుకు కంటిమీద కునుకు కరువైందని ఆయన సన్నిహితులు అంటున్నారు. తాడేపల్లిగూడెం మరింత సమస్యాత్మకం కానుంది. ఇక్కడ ఇప్పటికే కొట్టు సత్యనారాయణ, ఈలి నాని టీడీపీలో చేరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ సీటును బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు తన్నుకుపోతే వారి గతి అధోగతే. కొవ్వూరులో తనను మించిన నాయకుడు టీడీపీలో లేరని చెప్పుకునే టీవీ రామారావు సీటుకు బీజేపీ ఎసరు పెడుతోంది. ఆ స్థానం నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ పి.శ్రీనివాస్ కంటే బి.బెనర్జీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా బెనర్జీకి సీటిస్తే రామారావు దుకాణం మూసేయాల్సిందే. అసలే లేనిపోని వివాదాలతో ఇప్పటికే అటు ప్రజల్లో, ఇటు పార్టీలోనూ వ్యతిరేకత తెచ్చుకున్న ఆయనకు టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయన కలవర పడుతున్నారు. ఇలా ప్రతిచోటా టీడీపీలో ఇప్పుడు బీజేపీ పొత్తు చిచ్చు రేపుతోంది. -
రెండో రోజు 8 నామినేషన్లు
తాండూరు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఒక్కరొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. తాండూరులోని ఇందిరానగర్‌కు చెందిన శ్రీగోపాల్, అలియాస్ చిలుక గోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా తాండూరు అసెంబ్లీ నుంచి పోటీకి నామినేషన్ వేశారు. మధ్యాహ్నం 12.10గంటల తర్వాత అనుచరులతో వచ్చి నియోజకవర్గ ఎన్నికల అధికారి హరీష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. 2009లోనూ గోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2000 సంవత్సరం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గోపాల్‌కు రామచిలుక గుర్తు వచ్చింది. అప్పటినుంచి ఆయన్ను చిలుక గోపాల్ అంటున్నారు. ‘పట్నం’ అసెంబ్లీకి ఒకటి.. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక నామినేషన్ దాఖలైంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తరఫున ఈ నామినేషన్ దాఖలైంది. కిషన్‌రెడ్డి సతీమణి మంచిరెడ్డి ముకుంద ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.విఠల్‌కు అందజేశారు. కిషన్‌రెడ్డి తనయుడు, ఐఎస్ సదన్ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, పట్నం టీడీపీ అధ్యక్షుడు జిలమోని రవీందర్ ఆమె వెంట ఉన్నారు. ఈ నెల 9న భారీ ర్యాలీ నిర్వహించి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్టు తెలిసింది. మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి ఇద్దరు.. మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సరూర్‌నగర్ ఆర్డీఓ కే.యాదగిరిరెడ్డి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపిరామ్ తెలిపారు. టీఆర్ఎస్ తరఫున నోముల మల్లేష్, రాష్ట్రీయ సమైక్య సమితి పార్టీ నుంచి సుతారపు పద్మయ్యలు నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఇదిలా ఉండగా ఉప్పల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎన్వీవీఎస్ ప్రభాకర్ నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు.