ప్రజాభీష్టం మేరకు పనిచేయండి
సభ సంప్రదాయాలను మంటగలపొద్దు
చట్టసభల సభ్యులుగానే కాకుండా నాయకులుగా ఎదగండి
ఎమ్మెల్యేలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉద్బోధ
హైదరాబాద్: ప్రజాభీష్టానికి అనుగుణంగా పని చేసి నాయకులుగా ఎదగాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉద్బోధించారు. కొత్త సభ్యుల శిక్షణా రెండో రోజు కా ర్యక్రమంలో శనివారం ఆమె కీలకోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే నాయకులవుతారని, గొప్పగా ఉండటం, గొప్పగా కనిపించడంలో వ్యత్యాసాన్ని తెలిసి మసలుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులుగా మీరు పొందుతున్న దానికంటే ప్రజలకు ఎక్కువ అందించగలగాలి. అప్పుడే గొప్ప నాయకులవుతారు. సవాళ్లకు సామరస్య పూర్వక పరిష్కారాలు చూపించడం చట్ట సభల బాధ్యత. ఆ సభల్లో సభ్యులుగా మీ ఆలోచనలు, ప్రవర్తన, ఆలోచనా వి ధానం అందుకు అనుగుణంగా ఉండాలి. సభా సంప్రదాయాలను గౌరవించాలి. చర్చలు అర్థవంతంగా జరగడానికి సభ్యులు తమ వంతు సహకారం అందించాలి. సంప్రదాయాలను గౌరవిస్తే.. ప్రజల గొంతుక వినిపించే అవకాశం తప్పకుండా వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. వారిని కూడా ప్రజలే ఎన్నుకున్నారనే విషయాన్ని అధికారపక్షం మరిచిపోకూడదు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చినప్పుడే అధికార పక్షానికి గౌరవం దక్కుతుంది.
పార్లమెంటరీ వ్యవస్థలో కమిటీలు కీలకం : కేంద్ర మంత్రి నజ్మా హెఫ్తుల్లా
పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ కమిటీల పాత్రను కేం ద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెఫ్తుల్లా వివరించారు. కమిటీల్లో ప్రతిపక్షాల సభ్యులే కీలక పాత్ర పోషిస్తారని, ప్రజాస్వామ్యంలో అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి కీలక బాధ్యత ఉంటుందన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సభ్యులు అభిప్రాయాలు వెల్లడించడానికి, మెరుగైన విధానాల రూపకల్పనకు కమిటీలు ఉపయోగపడతాయని చెప్పారు.
హాజరుకాని అరుణ్‌జైట్లీ
రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆయన రాలేదు. శాసనమండలి చైర్మన్, కొంత మంది మంత్రులు కార్యక్రమంలో మాట్లాడాల్సి ఉన్నా.. వారికి అవకాశం ఇవ్వలేదు. భోజనానంతరం కూడా కొనసాగాల్సిన శిక్షణ కార్యక్రమం.. భోజన విరామం కంటే గంట ముందుగానే ముగిసింది.