
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అసెంబ్లీ సమావేశాలకు ముగింపు పలుకుతూ సీఎం బాబు వచ్చే శాసనసభలో తిరిగి తన స్థానంలో కూర్చోవాలని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఉండవలసిన స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అధికారపార్టీ అధినేతకు అనుకూలంగా ఇలాంటి ప్రకటనలు చేయడం గర్హనీయం. టీడీపీకి వీర విధేయతను తెల పడం కోసం, ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేపట్టిన (అ)ధర్మ పోరాట దీక్షలో స్పీకర్ పాల్గొన్నారు. దీంతో సామాన్య ప్రజలు కూడా స్పీకర్ తన పదవిని దుర్వినియోగ పరుస్తున్నారని అర్థం చేసుకుంటున్నారు. గతంలో ప్రధాన ప్రతిపక్షాన్ని కించపరిచేలా అధికార పార్టీ సభ్యులు నిందావ్యాఖ్యలు చేస్తున్నా సభాపతి కనీసం అడ్డుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిని అనరాని మాటలతో అవమానిస్తున్నా సభా మర్యాదకయినా మందలించిన పాపాన పోలేదు. ప్రతిపక్ష నేత ప్రసంగించినప్పుడు మైకును పలుమార్లు కట్ చేశారు. కానీ, అధికారపార్టీ సభ్యులు ప్రతిపక్ష నేతను అరుపులు కేకలతో అడ్డుకున్నప్పుడు కూడా స్పీకర్ స్పందించలేదు.
అదే సమయంలో ప్రతిపక్ష సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణకు స్పీకర్ విలువనిచ్చి ఏడాదిపాటు సభలోకి అనుమతించలేదు. టీడీడీకి చెందిన పద్మావతి గెస్ట్ హౌస్‌లో స్పీకర్ కోడెల నిర్వహించిన సమావేశంలో మాజీ శాసన సభాపతి ఆగరాల ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాను సంవత్సర కాలం సభ నుంచి బహిష్కరించడం ఏమాత్రం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. సభ్యులు తమ నియోజకవర్గ విషయాలతోపాటు రాష్ట్ర సమస్యలను సభ దృష్టికి తేవడానికి అవకాశం కల్పించాలి తప్ప సభలోకే రాకుండా అడ్డుకోవడం అప్రజా స్వామ్యమని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ 22 మంది ప్రతిపక్ష శాసన సభ్యులను ప్రలోభపెట్టి అధికార పార్టీలోకి చేర్చుకుని ఏళ్లు గడిచిపోయాయి. ఫిరాయింపు శాసన సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలనీ ఎన్నిమార్లు స్పీకర్‌కు విన్నవించినా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఏకపక్షంగా అధికార పార్టీకి వంతపాడుతున్న స్పీకర్ కోడెల నడిపించిన తీరుతో ప్రతిపక్ష సభ్యులు విసిగిపోయి శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. స్పీకర్‌గా కోడెల సభను నిర్వహించిన తీరు సమంజసం కాదు.
-జయరామిరెడ్డి, తిరుపతి మొబైల్ : 79816 76509
Comments
Please login to add a commentAdd a comment