మరో రోడ్డు ప్రాజెక్టు విక్రయిస్తున్న జీఎంఆర్
♦ ఎన్హెచ్13కి చెందిన ప్రాజెక్టులో 51% వాటా విక్రయం
♦ తగ్గనున్న రూ. 1,078 కోట్ల రుణ భారం, చేతికి 85 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘అసెట్ లైట్ - అసెట్ రైట్’ కార్యక్రమంలో భాగంగా జీఎంఆర్ గ్రూపు మరో రోడ్డు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతోంది. కర్ణాటకలో ఉన్న 99 కి.మీ రోడ్డు ప్రాజెక్టులో 51 శాతం వాటాను విక్రయించడానికి భాగస్వామ్య కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ వాటా విక్రయం ద్వారా జీఎంఆర్ గ్రూపునకు రూ.1,078 కోట్ల రుణ భారం తగ్గడమే కాకుండా, రూ. 85 కోట్ల నగదు రానున్నట్లు కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వాటా విక్రయం రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ కింద జీఎంఆర్ గ్రూపునకు చెందిన 14.99 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
ఈ లావాదేవీకి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మొత్తం 51 శాతం వాటా విక్రయం పూర్తవుతుందని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జీఎంఆర్ చేతిలో మొత్తం 730 కి.మీ విస్తీర్ణం కలిగిన తొమ్మిది హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుల కోసం రూ. 6,000 కోట్లు వ్యయం చేసినట్లు అంచనా. జీఎంఆర్ గ్రూపు రుణాలు రూ. 43,400 కోట్లు ఉండటంతో అప్పులను తగ్గించుకోవడంలో భాగంగా భారీగా రుణాలున్న ప్రాజెక్టులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు రోడ్డు ప్రాజెక్టులను విక్రయించిన సంగతి తెలిసిందే.