ఇంటికి సోలార్ పవర్ కావాలంటే?
సోలార్‌సిస్టం ఏర్పాటుకు కావాల్సిన కనీసం 10 చదరపు గజాల స్థలం మీ భవనంపై ఉండేలా చూసుకోవాలి. ఉంటే మీ దగ్గరలో ఉన్న విద్యుత్ వినియోగదారుల సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉచితంగా దరఖాస్తును పొందవచ్చు.
ఇందు కోసం మీరు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ప్రస్తుత కరెంట్ బిల్ జిరాక్స్, అడ్రస్, ఐడి ఫ్రూప్‌లతో పాటుగా ఎస్ఎస్పీడీఎస్ పేరుపై రూ.1000 డీడీ తీసి అక్కడ ఇవ్వాలి.
దరఖాస్తుతో పాటుగా రెండు ఎన్వలప్ కవర్లపై సెల్ఫ్ అడ్రస్ రాసి రూ.5 పోస్టల్ స్టాంప్‌లను అతికించి ఇవ్వాలి.
మీ దరఖాస్తును స్థానిక అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) పరిశీలించి, సోలార్ సిస్టంను ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. స్థలం అనుకూలంగా ఉంటే పదిహేను రోజుల పని దినములలో మీకు అప్రూవల్ లెటర్ వస్తుంది. తర్వాత మీరు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏదైనా డీలరును సంప్రదించి పని మొదలు పెట్టవచ్చు.
డీలరు ఇందుకు కావాల్సిన సోలార్ పరికరాలు, ఇన్వ్ర్టర్, బ్యాటరీలను ఏర్పాటు చేస్తారు. పని పూర్తి అయినప్పుడు మీకు ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ మీటరును అమరుస్తారు. ఈ మీటరు కోసం మీరు విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
3 కేవీ వరకు డొమస్టిక్: ఒక మీటరు కనెక్షన్‌కు 3 కేవీ వరకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇస్తారు. 1 కేవీకి 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. ప్రతి అదనపు కిలోవాట్‌కు 10 చదరపు మీటర్ల స్థలం కావాలి. 1కేవీ నుంచి 3కేవీ వరకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని డొమస్టిక్గా పరిగణిస్తారు. 99.99 శాతం ఈ విధానానికి అందరూ అర్హులే. 5 కేవీ సామర్ధ్యం నుంచి ప్రభుత్వం కేవలం 30 శాతం సబ్సిడీ ఇస్తుంది.
అమ్ముకోవచ్చు: ఈ సిస్టం ద్వారా పొందిన విద్యుత్‌ను మీ ఇంటి అవసరాలకు వాడుకొని... మిగులు విద్యుత్‌ను తిరిగి విద్యుత్ గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు.
ఉదా: మీరు ఒక నెలలో 700 యూనిట్లు ఉత్పత్తి చేశామనుకుందాం. అందులో మీరు 500 మాత్రమే వాడుకుంటే మిగిలిన 200 యూనిట్లను గ్రిడ్ కొనుగోలు చేస్తుంది.
ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కవ వాడుకుంటే వాడుకున్న దానికే బిల్లు కట్టాలి.
ఉదా : 700 యూనిట్లు ఉత్పత్తి చేసి 800 యూనిట్ల కరెంట్ వాడుకుంటే మీరు 100 యూనిట్లకు బిల్లు చెల్లించాలి.
డీలర్ల వివరాల కోసం www.nedcap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మరిన్ని వివరాలను apcentralpower.com లో సోలార్ రూ్ఫ్టాప్ నెట్ మీటరింగ్ అప్షన్‌ను క్లిక్ చేసి పొందవచ్చు. లేదా మీ దగ్గరలోని ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్లో అధికారి డీఈని, కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఏడీఈని సంప్రదించవచ్చు.