సర్వేకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
రాంనగర్ :ఈ నెల 19న చేపట్టనున్న సమగ్రకుటుంబ సర్వే కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శని వారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నోడల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి మండలాన్ని క్లస్లర్లుగా విభజించుకుని ఆయా కస్టర్ల వారీగా రూట్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలకు ఎన్యుమరేటర్లు సక్రమంగా చేరేవిధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ఒక వేళ వర్షాలు కురిసే అవకాశం ఉం టే ఈనెల 18వ తేదీనే గ్రామాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్యుమరేషన్ పూర్తిచేయడంలో ఏమైనా సమస్య తలెత్తినట్లయితే వెంటనే సూపర్ వైజర్కుగానీ, నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి వారి సలహాలు తీసుకోవాలన్నారు. ఎన్యుమరేషన్ పూర్తి అయిన ఇంటికి స్టిక్కర్ అంటించాలన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లకు అతని బ్లాకుకు సంబంధించిన పెన్షన్ వివరాలు, భూమికి సంబంధించిన వివరాలు, ఇళ్లకు సంబంధించిన సమాచారం అందజేయాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. ఎన్యుమరేటర్లు తక్కువ పడినట్లయితే డిగ్రీ చదువుకుని ఉన్న ఉపాధిహామీ పథకం మేట్లను తీసుకోవాలన్నారు. భార్యభర్త ఇద్దరూ ఉద్యోగులు అయి సర్వే విధులు నిర్వహిస్తున్నట్లయితే వారు విధులు నిర్వహిస్తున్నట్లు డ్యూటీ సర్టిఫికెట్ సమర్పించి తహసీల్దార్‌ను కలిసి తెలియజేసినట్లయితే సంబంధిత సూపర్వైజర్ మరుసటి రోజు వెళ్లి ఎన్యుమరే షన్ పూర్తిచేస్తారన్నారు. కుటుంబ సర్వే నిర్వహించే ముందు రోజు ప్రతి గ్రామంలో టాం...టాం వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు జేసీ వెంకట్రావ్, జిల్లా పరిషత్ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీఆర్డీఏపీడీ సుధాకర్, డ్వామా పీడీ సునంద పాల్గొన్నారు.
ప్రజల స్థితిగతులు తెలుసుకోవడం కోసమే సర్వే
నల్లగొండ : ప్రజల స్థితిగతులు తెలుసుకోవడం కోసమే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులకు సమగ్ర కుటుంబ సర్వే -2014పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సర్వే సామరస్య పూర్వకంగా, సుహృద్భావ వాతావరణంలో జరిగే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో, మండలాల్లో సర్వేపై ప్రజలకు విస్త్రతంగా అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని, టాం.. టాం.. వేయించాలని సూచించారు.
సమగ్ర కుటుంబ సర్వే -2014పై ఫార్మాట్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు వివరించారు. జిల్లా ప్రత్యేకాధికారి అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో ఈ సమగ్ర సర్వే నిర్వహిస్తుందన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సదస్సులో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వీరేశం, రవీంద్రకుమార్, వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు. సభ్యులు సర్వేకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సభ్యులు పోటీపడి మరీ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు.
సునీత జన్మదిన వేడుకలు
సమావేశ అనంతరం ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత జన్మదిన వేడుకలను సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.