మృత్యు గుమ్మి
గాదెగుమ్మిలో అసిస్టెంట్ సేల్స్‌మేనేజర్ గల్లంతు
మొత్తం 39 మందిని మింగేసిన జలపాతం
{పమాదాల నివారణకు ముందస్తు చర్యలు శూన్యం
కొయ్యూరు: గాదెగుమ్మి మరొకరిని బలితీసుకుంది. సరదాగా ఇక్కడ గడిపేందుకు వచ్చేవారు ప్రమాదానికి గురై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ జలపాతం వద్ద గడిపేందుకు వచ్చిన యువకుడు గురువారం సాయంత్రం ఇందులో గల్లంతయ్యాడు. అతడు మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ప్రవాహం తక్కువగా ఉన్నా..లోతు ఎక్కువ కావడంతో అందులో పడి గల్లంతయ్యాడు. విశాఖపట్నానికి చెందిన నవీన్(28) నర్సీపట్నం జయభేరి కార్ల షోరూంలో అసిస్టెంట్ సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం నవీన్ ,అతని స్నేహితులు అనంత్, ఎమ్డీ జఫరుల్లా విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి ముగ్గురూ గాదేగుమ్మి జలపాతం వద్దకు వచ్చారు.
ఇక్కడ గంటల తరబడి సరదాగా గడిపారు. ఫొటోలు తీసుకుంటుండగా కాలు జారి నవీన్ జలపాతంలో పడిపోయాడు. ఇలా జలపాతంలో పడి మరణించిన వారి సంఖ్య 39కి చేరింది. కార్తీక మాసంలో ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతం పిక్నిక్కు ప్రసిద్ధి. ఎక్కెడెక్కడి నుంచో ఇక్కడి అందాలను తిలకించేందుకు వచ్చి ప్రమాదానికి గురవుతున్నారు. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాము తెలిపారు. గాలించినప్పటికీ ఫలితం లేకపోవడం, చీకడిపడిపోవడంతో శుక్రవారం కొనసాగిస్తామన్నారు. ఇందులో మునిగినవారు అడుగుభాగంలో ఉన్న రాయికిందికి వెళ్లిపోతున్నారు. వినయ్‌చంద్ ఐటీడీఏ పీవోగా ఉన్నప్పుడు రూ.లక్షతో ఈ రాయిని పగులగొట్టే పనులు చేపట్టారు. పూర్తి చేయకపోవడంతో జలపాతంలో పడిన ఎవరైనా వెంటనే బయటకు రాలేక చనిపోతున్నారు.