పొట్ట కొట్టడం దారుణం
కలెక్టరేట్ ఎదుట ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా
మద్దతు పలికిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల
విజయనగరం మున్సిపాలిటీ : వలసలు నివారించి ఉన్న ఊరిలోఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం అమల్లో కీలక పాత్ర పోషించే ఫీల్డ్ అసిస్టెంట్ల పొట్టకొట్టే ప్రయత్నాలకు ప్రభుత్వం దిగడం అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ కోలగట్ల.వీరభద్రస్వామి అన్నారు. ప్రభుత్వం పన్నుతున్న కుట్రలకు వ్యతిరేకంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ధర్నా చేపట్టారు.
ఈ సందర్బంగా వారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. ధర్నా చేపట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లకు కోలగట్ల మద్దతు పలకడంతో పాటు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు జవాబు చెప్పే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వచ్చే నెల 17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.సూరపరాజు, జీవీ రంగారావు, ఆశపు.వేణు, నడిపేన.శ్రీను, ఎస్.బంగారునాయుడులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.