వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ
అసలే అధ్యాపకుల్లేని విభాగాల్లో మొదట భర్తీ
ఆ తరువాత మిగతా విభాగాల్లో..
మరో నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికిప్పుడు అధ్యాపకుల అవసరం ఎక్కువగా ఉన్న విభాగాల్లోని ఖాళీలను మాత్రమే మొదట భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మిగతా ఖాళీలను ఆ తరువాత భర్తీ చేసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీ వారీగా మొదట భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను తేల్చే పనిలో ఉన్నత విద్యా మండలి నిమగ్నమైంది.
పాలమూరు యూనివర్సిటీలో 90 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీల్లో అత్యవసరం అరుున పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,528 పోస్టులు ఖాళీగా ఉండగా, మొదట అందులో సగం వరకే పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మరో నాలుగు రోజుల్లో వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులను గుర్తించి ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ఫైలు పంపించేందుకు సిద్ధమవుతోంది.
ఖాళీగా ఉన్న 1,528 పోస్టుల్లో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గడిచిన మూడేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డారుు. వీసీలు లేకుండా వాటిని భర్తీ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇన్నాళ్లు పక్కన పెట్టింది. ఇటీవల 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం ఇప్పుడు అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. డెరైక్టు రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆయా యూనివర్సిటీల వీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది.