భరోసా అంటివి.. బజారున పడేస్తివి!
గతంలో రూ. 200 అయినా నెలనెలా ఒకటో తేదీనే ఇంటికాడికి వచ్చి పింఛనీ ఇచ్చేటోళ్లు. మా పెభుత్వం వస్తే పింఛనీ పెంచి భరోసా కల్పిస్తానంటివి. ఇప్పుడేమో ఉన్న పింఛనీ తీసేసి బజారున పడేస్తివి. ఆధార్ కార్డు, బియ్యం కార్డు, డెత్ సర్టిఫికెట్టు ఇంకా ఏవేవో కావాలంటూ కండీషను పెడ్తివి. పింఛనీ వస్తుందో, రాదో తెలీదు కానీ..వాటికోసం ఆఫీసులు, జిరాక్సు సెంటర్ల చుట్టూ తిరగడంతోనే మా పనైపోతోంది. మాయ మాటలు నమ్మి ఓట్లేసినందుకు ఎన్ని కష్టాలు పెడుతున్నావు బాబూ...అంటూ సీఎం చంద్రబాబు తీరుపై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మండిపడ్డారు.
కదిరి టౌన్ :స్థానిక మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు గంగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఎస్.బీబీజాన్ అధ్యక్షతన జన్మభూమి-మా ఊరు గ్రామ సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఏ కారణం చేత తమ పింఛన్లు తొలగించారంటూ అధికారుల ఎదుట ఆందోళన చేశారు.
ఆధార్, ఓటరు కార్డు, డెత్ సర్టిఫికెట్ ఇలా అన్నీ కలిపి దరఖాస్తు చేసుకుంటేనే అప్పట్లో అధికారులు వితంతు పింఛనీ మంజూరు చేశారు. ఇప్పుడేమో ఆధార్ కార్డు ఇవ్వలేదని, ఆధార్‌లో నిర్ణీత వయసు ఉన్నా రేషన్‌కార్డులో తక్కువ ఉందని, భూమి లేకపోయినా భూమి ఉందంటూ ఇలా లేనిపోని కారణాలతో పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని బాధితులు వాపోయారు.
వార్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకుడు వలీ అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం పింఛన్ల పునరుద్ధరణ, రేషన్‌కార్డు, ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు తదితర సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్టోబర్ మాసం పింఛన్లను లబ్ధిదారులకు కార్పొరేటర్ బీబీజాన్ అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ వెంకటరమణ, శానిటరీ ఇన్ స్పెక్టర్ జగన్, టీపీఓ కిష్టప్ప, బాబు మాస్టర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.