కనకమహాలక్ష్మికి ‘అష్టదళ పద్మారాధన’
డాబాగార్డెన్స్: నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం ‘అష్టదళ పద్మారాధన’ ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు పూజ నిర్వమించారు. ప్రత్యేక పూజలో 12 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజ ప్రతి గురువారం నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో జ్యోతిమాధవి తెలిపారు. రూ.1,116లు చెల్లించిన యెడల వారి తరపున దంపతులను ఈ ప్రత్యేక పూజకు అనుమతించనున్నట్టు చెప్పారు. పూజకు కావల్సిన పూజా సామగ్రిని దేవస్థానమే అందజేస్తుందన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు అభిషేకం లడ్డు, చక్కెరపొంగలి, కండువా, జాకెట్టు ముక్క, అమ్మవారి లామినేషన్ ఫొటో అందజేయనున్నట్టు పేర్కొన్నారు.
ఘనంగా శ్రావణలక్ష్మి పూజలు
శ్రావణ లక్ష్మి పూజలు గురువారం రెండో రోజు ఘనంగా జరిగాయి. వేదమంత్రాలు, నాదస్వర సుస్వరాల మధ్య లక్ష్మి పూజలు చేశారు. శ్రావణలక్ష్మి పూజలో 100 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పోస్టు ద్వారా మరో నలుగురు భక్తుల పేరిట పూజ నిర్వహించి కుంకుమ, అమ్మవారి యంత్రం, ప్రసాదం పంపారు.