52 పోస్టులు.. 18,490 దరఖాస్తులు
ఆదిలాబాద్ క్రైం : జిల్లా కోర్టుల్లో అటెండర్ ఉద్యోగాల కోసం డబ్బులు అడుగుతున్నారనే వదంతులు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి సూచించారు. మొత్తం 52 పోస్టులకు గానూ 18,490 దరఖాస్తులు వచ్చినట్లు మంగళవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నవంబర్ 12న జిల్లాలోని ఆయా కోర్టుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్‌కు విడుదల చేశామని, ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.
పోస్టు, కొరియర్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించినట్లు చెప్పారు. నేరుగా దరఖాస్తులు తీసుకొచ్చిన వాటిని తిరస్కరించామని తెలిపారు. ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, రికమండేషన్లు తీసకొస్తే దరఖాస్తులు తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కమిటీ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కాగా దరఖాస్తులు చేసుకున్న వాటిలో చాలా మంది దరఖాస్తు ఫారాల మీద గజిటెడ్ సంతకాలు, అభ్యర్థి సంతకాలు లేవని, ఫొటోలు అతికించకపోవడం, విద్యార్హత పత్రాలు జత చేయని దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు.
వీరికి పోస్టల్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ఈ ఉద్యోగాలకు 7వ తరగతి చదివిన వారికి అర్హత కల్పించినా డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న వారు సైతం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్లో ఇచ్చిన అర్హతను బట్టి మాత్రమే ఎంపిక చేస్తామని, విద్యార్హత ఎక్కువ ఉన్నవారికే జాబ్ వస్తుందనే అపోహ వద్దని స్పష్టం చేశారు.