20 కి.మీ. నడక విజేత గుర్మీత్
జైపూర్: ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు అథ్లెట్లు జాతీయ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాల సమయాన్ని సవరించారు. శనివారం జరిగిన 20 కిలోమీటర్ల నడక రేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన గుర్మీత్ సింగ్ గంటా 21 నిమిషాల 24.57 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయం గంటా 24 నిమిషాలు. ఈ రేసులో ఏడుగురు అథ్లెట్లు ఈ సమయాన్ని సవరించడం విశేషం. గణపతి (తమిళనాడు-1గం:21ని.51.43 సెకన్లు) రజతం సాధించగా... సందీప్ కుమార్ (హరియాణా-1గం:21ని.56.81 సెకన్లు) కాంస్య పతకం నెగ్గాడు. కేటీ ఇర్ఫాన్ (కేరళ-1గం:22ని.14.02 సెకన్లు), మనీష్ సింగ్ (ఉత్తరాఖండ్-1గం:22ని.18.89 సెకన్లు), దేవేందర్ సింగ్ (హరియాణా-1గం:22ని.40.60 సెకన్లు), నీరజ్ (హరియాణా-1గం:23.34.02 సెకన్లు) తర్వాతి స్థానాల్లో నిలవడంతోపాటు రియో ఒలింపిక్స్ అర్హత సమయాన్ని అధిగమించారు.