విభజన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకగలరా?:షర్మిల
ఆత్మకూరు: విభజన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకగలరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఈ మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సాక్షాత్తు హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణవాదులు దాడి చేశారు. నిన్న ఏపి ఎన్జీఓలపై దాడి చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాష్ట్రం విడిపోతే హైదరాబాదులో సీమాంధ్రుల పరిస్థితి ఏమిటని అడిగారు.
గతంలో మద్రాసును తీసుకున్నారు, ఇప్పుడు సీమాంధ్రులకు హైదరాబాద్‌ను దూరం చేస్తామంటున్నారన్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే సగం ఆదాయం వస్తోంది. హైదరాబాద్‌పై హక్కులేదంటే సంక్షేమ పథకాలు అమలయ్యేది ఎలా? పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మాణం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల అభివృద్ధికి నిదర్శనం హైదరాబాద్ అని తెలిపారు.
విభజనకు అంగీకరిస్తూ బ్లాంక్ చెక్ లాంటి లేఖను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చారు. విభనకు అసలు కారకుడు చంద్రబాబేనని షర్మిల మండిపడ్డారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్, టిడిపి నేతలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగిపోయేదన్నారు. నాలుగు సీట్ల కోసం కోట్ల మంది తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.