జ్యోతిష్యం చెప్పాలంటూ ఇంటికొచ్చి...
హైదరాబాద్: జ్యోతిష్యం చెప్పాలంటూ వచ్చి.. ఏకంగా జ్యోతిష్యుడిపైనే దాడి చేసిన ఘటన ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన కిషన్‌జీ జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. శనివారం సాయంత్రం ఆయన ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. తమకు జ్యోతిష్యం చెప్పాలని కోరారు.
ఆయన అంగీకరించి వారికి జ్యోతిష్యం చెప్పేందుకు యత్నిస్తుండగానే.. వారు కత్తులతో ఆయనపై దాడి చేశారు. అడ్డువచ్చిన కిషన్ జీ కారు డ్రైవర్‌పైనా దాడి చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. స్థానికులు గాయపడిన కిషన్ జీని, ఆయన డ్రైవర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.