మారేడ్‌పల్లిలో మళ్లీ అలజడి
అరెస్టుకు భయపడి రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం
ఠాణాపై దాడి ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టులను వేగవంతం చేశారు. దాడికి పాల్పడినవారిలో ఇప్పటికే 48 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం తెల్లవారు జామున మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌పై దాడికి కారకులైన రౌడీషీటర్ దశరథ్, ఎమ్మార్పీఎస్ నేత సాయితో పాటు మరికొందరిని పోలీసులు పట్టుకున్నారు. రాత్రి 2 గంటలకు లాలాగూడలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న రౌడీషీటర్ దశరథ్ను అదుపులోకి తీసుకుంటుండగా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది.. దశరథ్ను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో దశరథ్ పరోక్షంగా సహకరించారని పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దశరథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.
గతంలోనూ ఆత్మహత్యాయత్నం
మారేడ్‌పల్లికి చెందిన దశరథ్పై 1989 లోనే పోలీసులు రౌడీషీట్ తెరిచారు. తర్వాత అతడిలో మార్పు రావడంతో 2001లో రౌడీషీట్ నుంచి అతడి పేరును తొలగించారు. కొన్నాళ్ల తర్వాత దశరథ్ ఓ హత్య కేసులో నిందితుడిగా తేలడంతో మళ్లీ రౌడీషీట్ తెరిచారు. అయితే అప్పటి నుండి తనపై రౌడీషీట్‌ను తొలగించాలని దశరథ్ ప్రయత్నిస్తున్నాడు. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. మరోసారి బలవన్మరణానికి అనుమతివ్వాలంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించి సంచలనం సృష్టించాడు. కాగా, పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో పోలీసులు అమాయకులను సైతం అరెస్టు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని, తక్షణమే అమాయకులను విడుదల చేయాల్సిందిగా ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలసి విన్నవించారు. సీపీని కలిసిన వారిలో టీడీపీ నేతలు టీఎన్ శ్రీనివాస్, డీఆర్ శ్రీనివాస్, కొండయ్య చౌదరి తదితరులున్నారు.