అసాధారణ నిరశన!
దృఢమైన సంకల్పానికి, సడలని విశ్వాసానికి ప్రతీకగా పద్నాలుగేళ్ల నుంచి అలుపెరగని రీతిలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మణిపూస ఇరోం షర్మిల ముందు చివరకు చట్టమే ఓడిపో యింది. ఒక రాజకీయ సమస్యపై నిరశన సంధించిన మహిళపై ఆత్మ హత్యాయత్నం కింద కేసు పెట్టడం తగదని, ఆమెను తక్షణం విడుదల చేయాలని అక్కడి న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ దీక్ష ప్రారంభించారు.
అమ్మను చూస్తే కరిగిపోతానని, దీక్షనుంచి తప్పుకుంటానని భయ పడి ఇరోం షర్మిల ఇన్నేళ్లుగా తల్లిని కూడా కలవలేదు. తన యవ్వ నాన్ని, తన కుటుంబ జీవితాన్ని...చెప్పాలంటే తన సమస్తాన్నీ నమ్మిన సిద్ధాంతం కోసం, తోటి పౌరుల క్షేమం కోసం త్యజించిన షర్మిల 14 ఏళ్ల ప్రస్థానాన్నీ గమనిస్తే మన ప్రజాస్వామ్యంలోని డొల్ల తనం బయటపడుతుంది. తన డిమాండు విషయంలో రాజ్యం ఇంత నిర్దయగా వ్యవహరిస్తుందని బహుశా షర్మిల దీక్ష ప్రారంభించిన ప్పుడు అనుకొని ఉండరు. అప్పటికామె సాధారణ మహిళ. ఇలాంటి మహిళలో ఇంతటి పట్టుదల దాగివున్నదని అటు పాలకులకూ తోచలేదు. కానీ... మంచినీళ్లు కూడా ముట్టనని చేసిన ప్రతిజ్ఞను ఆమె కాస్తయినా సడలించుకోలేదు.
కనుక ఆమెపై ఆత్మహత్యకు ప్రయత్నించారన్న ఆరోపణతో భారత శిక్షాస్మృతి సెక్షన్ 309 కింద ప్రభుత్వం కేసు పెట్టడం, న్యాయస్థానాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడం రివా జుగా వస్తున్నది. ఆమె ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు గనుక ముక్కు ద్వారా ట్యూబు పెట్టి బలవంతంగా ద్రవాహారాన్ని ఎక్కించడం ప్రారంభించారు. ప్రతిసారీ 364 రోజులు గడిచాక నామమాత్రంగా విడుదల కావడం, మళ్లీ అదే సెక్షన్‌కింద కేసు పెట్టి ఆమెను జైలుపాలు చేయడం కొనసాగుతూ వస్తున్నది. ఈ కాల మంతా ఇంఫాల్‌లోని ప్రభుత్వాస్పత్రి వార్డునే జైలుగా మార్చి ఆమెను నిర్బంధించారు. ఎవరూ కలవ కుండా కట్టడిచేశారు.
ఇరోం షర్మిల నిరాహార దీక్షకు దారితీసిన కారణాల పైనా, వాటి పరిష్కారానికి తాము తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాల్సిన పాలకులు ఆమెకు బలవంతంగా ఆహారాన్ని ఎక్కించడానికి ప్రయత్నించి తమ ‘మానవత్వాన్ని’ చాటుకున్నారు. ఇలా చేయడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే మనకు సిగ్గుచేటని, ప్రపంచానికి సత్యాగ్ర హమనే ఆయుధాన్ని అందించిన మహాత్ముడి స్మృతికి అపచారమని ఏ దశలోనూ వారికి తట్టలేదు.
ఇరోం షర్మిల రద్దు చేయాలని పోరాడిన ఆ చట్టం ఎలాంటిది? జాతీయోద్యమాన్ని అణచడం కోసం బ్రిటిష్ పాలకులు తెచ్చిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అత్యంత కఠినమైనది. ఆ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో కల్లోలిత ప్రాంతాల్లో పని చేస్తున్న జవాన్లు వారెంటు లేకుండా ఏ ఇల్లయినా సోదా చేయొచ్చు. ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. అనుమానం వస్తే కాల్చి చంపొచ్చు. వారి చర్యలను న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు. ఇలాంటి అప రిమిత అధికారాల అండతో అమాయక పౌరులపై జులుం ప్రదర్శి స్తున్నారని, తీవ్రవాదంతో సంబంధం లేని అనేకమంది యువతీయు వకులు అకారణంగా అదృశ్యమవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నా రని మానవ హక్కుల సంస్థలు చాన్నాళ్లుగా ఆరోపిస్తున్నాయి.
ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండు చేస్తున్నాయి. ఈ చట్టం సమీక్షకు జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలో 2004లో యూపీఏ సర్కారు కమిషన్ కూడా ఏర్పాటుచేసింది. ఆ కమిషన్ సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాల్సిందేనని స్పష్టంచేసింది. అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబంధనలను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. ఒక యువతి అదృశ్యం, హత్య విషయమై నియమించిన సి. ఉపేంద్ర కమిషన్ సైతం ఈ తరహాలోనే సిఫార్సుచేసింది. అయితే, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అండ లేకుండా తాము కల్లోలిత ప్రాంతాల్లో పనిచేయలేమని సైనిక దళాలు స్పష్టంచేయడంతో చట్టం కొనసాగించడానికే పాలకులు సిద్ధపడ్డారు. ఈ చట్టం మణిపూర్‌లోనే కాదు...ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ, జమ్మూ-కాశ్మీర్‌లోనూ కొనసాగుతున్నది.
ఆత్మహత్యాయత్నం నేరంగా పరిగణించడం తగదన్న లా కమిషన్ సూచనను ఆమోదించి, ఆ సెక్షన్‌ను రద్దు చేయడానికి నిర్ణయించినట్టు ఈమధ్యే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీవితంలో దగాపడ్డామని, మరణం తప్ప తమకు శరణ్యం లేదని భావించి ఆత్మహత్యకు సిద్ధపడి విఫలురైనవారిని నేరస్తులుగా జమకట్టడం అమానవీయమని లా కమిషన్ అభిప్రాయపడింది. సెక్షన్ 309 కి రోజులు దగ్గరపడిన సమయంలోనే... రాజకీయ కారణాలతో చేసే నిరశనను ఆత్మహత్యాయత్నంగా పరిగణించడం తగదని మణిపూర్ కోర్టు తీర్పునివ్వడం గమనించదగింది. ఈ సెక్షన్ తొలగింపుపై ‘మానవీయ కోణం’లో ఆలోచన చేస్తున్న తరహాలోనే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దుపై కూడా దృష్టిపెట్టడం అవసర మని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.
ఎలాంటి రాజకీయ అభిప్రా యాలూ లేని, ఏ సంస్థతోనూ సంబంధబాంధవ్యాలు లేని ఒక సాధా రణ మహిళ ఇన్నేళ్లనుంచి అలుపెరగని రీతిలో పోరాడుతున్న తీరు చూశాకైనా ఆ విషయమై ఆలోచించాలి. ఇరోం షర్మిల విషయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లి ఆమెను మరోసారి అరెస్టు చేయడమనే సులభమైన మార్గాన్ని ఎంచుకోవాలో... నిరంకుశ శాసనంగా నిర్ధారణ అయిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలో కేంద్రం తేల్చుకోవాలి.