పనితీరు మదింపులకు అకడమిక్ ఆడిట్ సెల్
పనితీరు మదింపులకు అకడమిక్ ఆడిట్ సెల్
ఏయూ, అకడమిక్ ఆడిట్ సెల్ au,academic,auditcell
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, పరీక్షల నిర్వహణ పనితీరును నిరంతరం మదింపు చేస్తూ, పటిష్టం చేసే దిశగా అకడమిక ఆడిట్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం సాయంత్రం ఏయూ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ అనుబంధ కళాశాలలకు సైతం దీనిని విస్తరించడం జరుగుతుందన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలతో బోధన, పరిశోధన సంబంధ అంశాలపై సంయుక్తంగా పనిచేయడానికి ఏయూ త్వరలో అవగాహన ఒప్పందం చేసుకుంటుందన్నారు.
హెరిటేజ్ వర్సిటీగా ఏయూ: ఏయూను వారసత్వ విశ్వవిద్యాలయం (హెరిటేజ్ వర్సిటీ)గా తీర్చిదిద్దుతామని వీసీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, ఏయూకు వాససత్వ సంపదగా నిలచే విశ్వవిద్యాలయంగా హోదా కల్పించాలని కోరుతామన్నారు. ప్రస్తుతం వర్సిటీలోని చారిత్రక, పురాతన భవనాల నిర్వహణకు, పూర్వవైభవం అందించడానికి రూ.100 కోట్లు అవసరమవుతుందన్నారు. వీటిపై సమగ్రంగా కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు. వర్సిటీలో బోధనను ఆసక్తిదాయకంగా చేయడానికి ఇ–క్లాస్‌రూమ్‌లను తీర్చిదిద్దాలని, ప్రతీ ప్రయోగశాలను ఆధునీకరించాలని సూచించారు. విభాగాలు తమకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కోరితే అవసరమైన నిధులు అందిస్తామన్నారు. దశల వారీగా ప్రతీ విభాగాన్ని పూర్తిస్థాయిలో అభివద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్స్, డీన్స్, విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
పూర్వవిద్యార్థుల సమావేశం
ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల విస్తత సమావేశాన్ని అక్టోబర్ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారన్నారు. ప్రతీ విభాగం తమ పూర్వవిద్యార్థులకు సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలని సూచించారు.