స్మార్ట్ సిటీగా నెల్లూరు
ఆస్ట్రేలియా కాన్సులేట్ బృందంతో మంత్రి నారాయణ చర్చలు
విజయవాడ బ్యూరో : నెల్లూరు నగరాన్ని స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ఆ స్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ చెప్పారు. చెన్నయ్‌లోని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సీన్ కెల్లీ బృందంతో ఆయన మంగళవారం సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణ నెల్లూరు నగరం ప్రత్యేకతలను వారికి వివరించారు. సముద్రానికి దగ్గరగా ఉండడం, కృష్ణపట్నరం పోర్టు, సమీపంలోనే చెన్నయ్ ఎయిర్‌పోర్టు ఉండడం, కావాల్సినంత భూమి కూడా అందుబాటులో ఉండడం వల్ల ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని తెలిపారు.
ఇందుకు ఆస్ట్రేలియా బృందం సమ్మతించింది. తిరుపతి నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో మాస్టర్‌ప్లాన్, సిటీ ప్లానులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ నమూనాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు మున్సిపల్ శాఖ, ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం అంగీకరించాయి. విద్య, పర్యాటకం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో తాము ఏపీకి మద్ధతు ఇస్తామని కెల్లీ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా బృందాన్ని నారాయణ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసి వివరాలు తెలిపారు.