హై అలర్ట్!
* ఏయూటీ అరెస్టులతో ముందస్తు చర్యలు
* సిటీలో నిఘా, తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు
* ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్న సీపీలు
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం పాతబస్తీలో ఏయూటీ హైదరాబాద్ మాడ్యుల్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేయడంతో ముందుజాగ్రత్త చర్యగా మూడు కమిషనరేట్ల అధికారులూ అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ వెస్ట్ సీపీ నవీన్‌చంద్, ఈస్ట్ ఇన్చార్జ్ సీపీగా ఉన్న జేసీపీ శశిధర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ విభాగం అధికారులు ఏర్పాటు చేసిన సర్వైలెన్స్ కెమెరాలతో పాటు కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు బషీర్‌బాగ్, గచ్చిబౌలీల్లోని పోలీసు కమిషనరేట్స్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో (సీసీసీ) అనుసంధానం చేశారు.
ఈ కెమెరాలను తాజా పరిస్థితుల నేపథ్యంలో నిఘా కోసమూ వినియోగిస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపై కన్నేసి ఉంచారు. కూడళ్లు, రహదారుల్లో జరుగుతున్న వ్యవహరాలను పసిగట్టడానికీ వీటిని ఉపయోగించనున్నారు. దీని కోసం సీసీసీల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరు అటు ప్రధాన కంట్రోల్ రూమ్‌తో పాటు ఫీల్డ్ స్టాఫ్‌తోనూ సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.
నగరంలోని ప్రతి చెక్‌పాయింట్, పికెట్ వద్దా ఉండే సిబ్బందిని అప్రమత్తం చేశారు. అత్యవసర సమయాల్లో వినియోగించడానికి స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచుతున్నారు. మూడు కమిషనరేట్ల వ్యాప్తంగా అనుమానితుల కదలికలను కనిపెట్టడం కోసం యూనిఫాంలో ఉన్న సిబ్బందితో పాటు భారీగా మఫ్టీ పోలీసుల్ని మోహరించారు. నగరంలోని జనసమర్థ ప్రాంతాలు, మాల్స్ తదితర చోట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సిటీలోని లాడ్జిలు, హోటళ్లు తదితరాల్లో బస చేస్తున్న వారి వివరాలనూ సేకరిస్తున్నారు.