ఫుల్ గరం గరంగా..!
‘‘నాన్నగారు, నేను, నా తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప మేమందరం బాలనటులుగా చేసినవాళ్లమే. ఆది కూడా చిన్నప్పుడు ‘కప్పలు’ అనే నాటకంలో నటించాడు. బాలనటులుగా రాణించిన మేం ఈ బాలల దినోత్సవం నాడు సొంత సంస్థ ఆరంభించడం ఆనందంగా ఉంది. నటుడు నర్రా వెంకటేశ్వరరావుగారి కుమార్తె వసంతా శ్రీనివాస్, నా భార్య సురేఖ, ఛాయాగ్రాహకుడు బాబ్జీ సతీమణి షీలా బాబ్జీ నిర్మాతలుగా ఆదితో ‘గరం’ నిర్మించారు. దర్శకుడు మదన్ చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసాయి స్క్రీన్స్ సంస్థను నిర్మాత అచ్చిరెడ్డి ఆవిష్కరించారు. ‘గరం’ మోషన్ పిక్చర్‌ను నటుడు రఘుబాబు, టైటిల్ లోగోను ఆది, అదా శర్మ ఆవిష్కరించారు.
‘‘ఒక సంపూర్ణమైన నటుడికి కావల్సిన అన్ని లక్షణాలూ ఉన్న హీరో ఆది’’ అని అచ్చిరెడ్డి అన్నారు. ఆది మాట్లాడుతూ - ‘‘సినిమా నిర్మాణం ఎంత కష్టమో మా హోమ్ బేనర్‌పై ఈ సినిమా నిర్మించినప్పుడు నాకు తెలిసింది. నిర్మాత లేనిదే సినిమా లేదు. అందుకే తెలుగు పరిశ్రమలో ఉన్న నిర్మాతలందరికీ ధన్యవాదాలు. నేను నిర్మాతల నటుడిగానే ఎప్పటికీ కొనసాగుతాను. అమ్మా, నాన్న, వసంతా ఆంటీ, షీలా ఆంటీల సపోర్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రకథలో ఒక ఫైర్ ఉంది. ఫుల్ గరం గరంగా ఉంటుంది. ఇందులో ఉన్న ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో చేశాం’’ అని చెప్పారు.
మదన్ మాట్లాడుతూ - ‘‘శ్రీనివాస్ గవిరెడ్డి ఓ పాయింట్ చెబితే చాలా నచ్చింది. దాంతో ఆ కథను నేనే తెరకెక్కిస్తానని తనను అడిగాను. మనం ద్వేషించేవాళ్లని ప్రేమించే స్థాయికి ఎదగాలంటే కష్టం. ఈ చిత్రం ప్రధానాంశం ఇదే. ఆది ఎంతగానో ప్రేమించి ఈ సినిమా చేశాడు’’ అని చెప్పారు. కథను నమ్మి సాయికుమార్‌గారు, మదన్‌గారు ఈ చిత్రం రూపొందించారని కథ-సంభాషణల రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి అన్నారు. సురేఖా సాయికుమార్, వసంతా శ్రీనివాస్, షీలా బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాబ్జీ, సంగీతదర్శకుడు అగస్త్య, ఛాయాగ్రాహకుడు సురేందర్ రెడ్డి, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.