నిర్లక్ష్యం ఖరీదు రెండు నిండు ప్రాణాలు
ఆటోడోర్ తాడు తెగిపోయి...
మరికొద్ది రోజుల్లో ఒకరింట శుభకార్యం
పరారీలో డ్రైవర్
జీలగలగండి(ఘంటసాల),న్యూస్‌లైన్ : ఆటోడ్త్రెవర్ నిర్లక్ష్యం రెండు నిండుప్రాణాలను బలితీసుకుంది. ఆటోలో వెనుక వైపు కూర్చుని వెళుతున్న ఇద్దరు డోరుకు కట్టిన తాడు ఊడిపోవడంతో మృత్యువాత పడ్డారు. వీరిలో పూషడం గ్రామానికి చెందిన అంకం వెంకట సుబ్బారావు(55) ఇంట్లో మరికొద్ది రోజుల్లో శుభకార్యం జరగనుండగా, చోటుచేసుకున్న ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం పూషడంకు చెందిన అంకం వెంకటసుబ్బారావు, మచిలీపట్నం మండలంలోని భోగిరెడ్డిపల్లికి చెందిన పడమటి సముద్రాలు(55) కలసి చల్లపల్లి మండలం మాజేరు బడ్డీల వద్ద చల్లపల్లి నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆటోలో ఎక్కారు. లోపల ఖాళీ లేకపోవడంతో వెంకటసుబ్బారావు మినుముల మూటను వెనుకవైపు డోరులో ఉంచి... పడిపోతుందేమోననే ఆందోళనతో అతనూ వెనుకవైపుఉన్న డోర్లో ఎక్కాడు. వెంకటసుబ్బారావుతో పాటు ఖాళీగా ఉందని సముద్రాలూ కూర్చున్నాడు.
అక్కడ నుంచి సుమారు 6కి.మీ దూరంలో ఉన్న జీలగలగండి శివారు దెయ్యపుడౌన్ వద్దకు రాగానే ఆటోడోర్కు ఉన్న తాడు ఊడిపోవడంతో వెనుక కూర్చున్న ఇద్దరూ రహదారిపై పడిపోయారు. ఇద్దరి తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఇది గమనించిన ఆటో డ్త్రెవర్ ఆటోను అక్కడ వదిలేసి పరారయ్యాడు. డోరుకు కట్టిన తాడు గట్టిగా ఉందో లేదో చూసుకోకుండా డ్త్రెవర్ ఈ ఇద్దరినీ ఎక్కించడం వల్లే చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.
కుమార్తె వివాహం చూడకుండానే...
వెంకటసుబ్బారావు చిన్నకుమార్తె వివాహం మే ఒకటో తేదీన జరగాల్సి ఉంది. వివాహం కోసం వచ్చే బంధువులకు పిండి వంటలు చేసేందుకు మినుములు పట్టించాలని మచిలీపట్నం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబానికి పెద్దదిక్కయిన వెంకటసుబ్బారావును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే చల్లపల్లి సీఐ దుర్గారావు, ఘంటసాల ఎస్ఐ టీవీ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.